
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా హౌసింగ్ సొసైటీ ఆవరణలో మేకల బలి ఇవ్వాలన్న ప్రయత్నం తీవ్ర వివాదానికి దారితీసింది. హిందూ కుటుంబాలు నివసిస్తున్న సొసైటీ మధ్యలోనే మేకలను తెచ్చి బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన స్థానికులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలపై దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మీరా రోడ్‌లోని ‘పూనం క్లస్టర్-1’ హౌసింగ్ సొసైటీలో 550కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది బక్రీద్ సందర్భంగా కొందరు ముస్లిం కుటుంబాలు సొసైటీ ప్రాంగణంలో మేకలను తీసుకువచ్చి బలి ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఈసారి సొసైటీ ఆవరణలో తాత్కాలిక షెడ్ నిర్మించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడాన్ని పలువురు హిందూ నివాసితులు వ్యతిరేకించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు, నివాస ప్రాంతాల్లో జంతు బలులు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సమయంలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష సింగ్ చేతికి గాయాలయ్యాయి.
ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు సొసైటీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన చేపట్టారు. హిందూ భావోద్వేగాలను గౌరవించాలని, నివాస ప్రాంతాల్లో జంతు బలి కార్యక్రమాలు నిర్వహించరాదని వారు డిమాండ్ చేశారు.
ఉద్రిక్తతల మధ్య కొందరు కార్యకర్తలు ప్రతీకాత్మకంగా పందిని లోపలికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంటనే అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తరువాత మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. చివరకు మున్సిపాలిటీ కేటాయించిన ప్రత్యేక ప్రాంతానికి మేకలను తరలించేందుకు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, దాడి ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానిక రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. హిందూ సంఘాలు మాత్రం “నివాస సముదాయాల్లో మతపరమైన పేరుతో జంతు బలులను బలవంతంగా నిర్వహించడం సహించబోము” అంటూ హెచ్చరిస్తున్నాయి.





