News

గ్రామం కనుమరుగై.. ఆలయం సాక్ష్యంగా నిలిచి !

8views

రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోగా వారు పాలించిన గ్రామాలు కూడా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని 35 బొల్లవరం గ్రామం ఎనిమిది దశాబ్దాల క్రితం కాలగర్భంలో కలిసిపోగా అక్కడ గ్రామం ఉన్నట్లుగా నిదర్శనంగా శిథిలమైన పురాతన శివాలయం నాలుగు స్తంభాలతో నిల్చొని నేటికి దర్శనమిస్తూ ఆ గ్రామచరిత్రకు సజీవసాక్ష్యంగా ఉంది. పురాతన శివాలయం సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహ ఉండగా భాస్కరాపురంవాసులు పదేళ్ల క్రిత ం గ్రామానికి తీసుకెళ్లి ప్రతిష్టించుకొన్నారు. ప్రస్తుతం నాలుగు స్తంభాల మధ్యన ధ్వంసమైన శివలింగం మాత్రం దర్శనమిస్తూ ఉంది. గుప్తనిధుల వేటగాళ్ల తవ్వకాలతో శివాలయం శిథిలం కాగా 2009లో పి.లింగాపురం గ్రామానికి చెందిన అవిజ నాగన్న, పార్వతీదేవి అనే భక్తులు 2009 డిశంబర్‌లో శిథిలమైన శివాలయానికి కొంత మేర మరమ్మతులు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. గత్తరరోగంతో పాటు పలురకాల వ్యాధులు వ్యాపించటంతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా కాలం చేస్తుండటంతో భయాందోళనకు గురైన 35 బొల్లవరం గ్రామస్తులు తోచిన దిక్కుగా వెళ్లి పలు గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకున్నట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు.కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఊరి పేరున నేటికీ 2,766.39 ఎకరాల రెవెన్యూ అలాగే కొనసాగుతుండటం విశేషం.