News

అనుభూతులు పంచుకున్న సంఘమిత్ర పూర్వ ఆవాస విద్యార్థులు

36views

నంద్యాల జిల్లాలోని సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ శ్రీ బాలాజీ మందిరం, శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దర్శన కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో సేవా భారతి ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ కేశవయ్య, అఖిల భారతీయ ఆవాసాల టోలి సభ్యులు శ్రీ రామాచారి, సేవా భారతి ప్రాంత సభ్యులు శ్రీ లింగం శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ సురేంద్ర, సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీ నాగసుబ్బారెడ్డి, సంఘటన కార్యదర్శి శ్రీమతి విజయశ్రీ, సహ కార్యదర్శి శ్రీ సుందర్‌రావు, కోశాధికారి శ్రీ నాగరాజు అయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరమ్మ, శ్రీ రమణయ్య గౌడ్, శ్రీ మోదాల రామాంజనేయులు, ఆవాస ప్రముఖ్ శ్రీ గంగాధర్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ శ్రీ రాము తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 80 మంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ ఆవాస దినాలను స్మరించుకుంటూ పాత మధురానుభూతులను, సరదా సంఘటనలను పంచుకున్నారు. ప్రస్తుతం తమ జీవితాల్లో సాధించిన పురోగతిని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆవాసంలో పొందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు సమాజ సేవలోనూ, వివిధ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

పూర్వ విద్యార్థుల్లో శ్రీ హరి ప్రస్తుతం సంఘ్‌లో జిల్లా ప్రచారక్‌గా సేవలందిస్తుండగా, శ్రీ నరసింహ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ రఘురాముడు తెలుగు గంగ ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తూనే నంద్యాల జిల్లా కార్యవాహగా సేవలందిస్తున్నారు.

అలాగే శ్రీ మహేశ్వర్‌రెడ్డి తిరుపతిలో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో అకౌంటెంట్, అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ, శ్రీమాతా బాలికల ఆవాసం స్థాపనలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. శ్రీ డి. భూషణ్ బేతంచర్లలో వ్యాపారం నిర్వహిస్తూ సంఘ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. శ్రీ నరసింహారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, శ్రీ శివ, శ్రీ నిరంజన్‌లు సంఘ్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రాంత, జిల్లా, విభాగ్ అధికారులు పూర్వ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆవాసంలో పొందిన సంస్కారాలు, నైపుణ్యాలను జీవితంలో వినియోగించి సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. కుటుంబ జీవనంతో పాటు సామాజిక సేవలోనూ ముందుండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది.