News

ధ్రువ్ రాఠీపై మండిపడ్డ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ న‌టి

7views

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ నటి, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘పాతాల్ లోక్’ ఫేమ్ గుల్ పనాగ్ గట్టిగా స్పందించారు. ప్రధాని పదవిని, దేశ గౌరవాన్ని విదేశీ గడ్డపై తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ధ్రువ్ రాఠీ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. “మోదీ ఎక్కడికి వెళ్లినా అవమానానికి గురికావాలి. ప్రధానమంత్రి అయిన ఈ 12 ఏళ్లలో ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన కనీస పారదర్శకత, జవాబుదారీతనం పాటించడంలో ఆయన విఫలమయ్యారు. యూరప్ దేశాల విదేశీ జర్నలిస్టులు ఆయన ఎక్కడ కనిపించినా నార్వే జ‌ర్నిలిస్ట్ హెల్లే లింగ్ అడిగిన‌ట్లు ప్రశ్నలు అడగాలని నేను కోరుతున్నాను. ప్రజల ముందు జవాబుదారీగా ఉండేలా ఆయనను మ‌రింత‌ ఇబ్బంది పెట్టండి. ఇది భారతదేశ ప్రగతికి మీరు చేసే గొప్ప సేవ అవుతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే ధ్రువ్ రాఠీ చేసిన ఈ వ్యాఖ్యలపై గుల్ పనాగ్ తీవ్రంగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి ఆలోచ‌న‌ బాలేదు. మీకు ప్రధానమంత్రి నచ్చకపోవచ్చు, ప్రభుత్వంతో విభేదించవచ్చు, నిరసనలు తెలపవచ్చు, చర్చలు జరపవచ్చు అలాగే భిన్నంగా ఓటు కూడా వేయవచ్చు. అది ప్రజాస్వామ్యం. కానీ భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ఆ వ్యక్తిని, విదేశాలలో ఆయన ప్రాతినిధ్యం వహించే స్థానాన్ని విదేశీ గడ్డపై ఒక జోక‌ర్‌గా మార్చడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇది నిరసన అనిపించుకోదు. ఇలా చేయడం వల్ల ఆయన గౌరవమే కాకుండా, మన వ్యవస్థ, మన దేశ ప్రతిష్ట కూడా దిగజారుతుంది అని గుల్ పనాగ్ స్పష్టం చెప్పుకోచ్చారు.