News

ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..!:

0views

ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్‌ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ చేరిపోయారు. ఏకంగా తమ దేశీయలు భారత్‌నుంచి ఈ విలవలు నేర్చుకోవాలంటూ ఓ లిస్ట్‌ చెప్పారామె. ఏంటా విలువలంటే..

ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న లిథువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువలు గురించి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మోనికా కుంజేశ్వరి దాసి భారత్‌లో నివశించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాలు గురించి మాట్లాడారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టిపారేస్తారు.

కానీ భారత్‌లోని చిన్న చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల్లో ఉన్న విలువలు యూరప్‌ చాలా వేగంగా కోల్పోతోందని అన్నారామె. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ ఇదే ముమ్మాటికీ నిజం అని అంటున్నారామె. “ఏళ్ల తరబడి భారత్‌లో నివసించాక తెలుసొచ్చిందేంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి నుంచి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి” అంటూ క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌లో ఆ విలువల జాబితాను పంచుకున్నారామె

యూరోపియన్లు తప్పక నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు..

ఆతిథ్యం: ‘అతిథి దేవో భవ’ అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు దాసి. దీని అర్థం ‘అతిథి దేవుడితో సమానం’. భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారామె.

కమ్యూనిటీ: యూరప్‌లో కమ్యూనిటీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువ ఇస్తారని దాసి అన్నారు. “ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగుపొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే, సహాయం చేయడానికి సాధారణంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారామె.

ఆహారం, వంట: ఆహారం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడమే సర్వసాధారణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఇష్టపడతారు.

పరిశుభ్రత: భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారని ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, పైగా చుట్టపక్కల వారిపట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామె.

ఆనందం: భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక కారణం ఏదీ అవసరం లేదని ఆ లిథువేనియన్ మహిళ నొక్కి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్‌ వేని, యూరప్‌ అది పూర్తిగా మర్చిపోయి.. గంభీరంగా అయిపోయిందని అన్నారు.

కాగా, నెటిజన్లు ఆమె పోస్టుని చూసి భారతదేశంలోని సానుకూల అంశాలను అందంగా చెప్పినందుకు ధన్యవాదాలు. మా విలువల పట్ల మీ సూక్ష్మమైన పరీశీలనకు గౌరవాభినందనలు అంటూ పోస్టులు పెట్టారు.