News

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

5views

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలక మండలి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజును కొనసాగిస్తూ 16 మంది సభ్యులు, మరొక ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలిని నాలుగు రోజుల క్రితం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉదయం తొమ్మిది గంటలకు సింహగిరిపై నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్‌ భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. సభ్యులకు దేవస్థానం సిబ్బంది ప్రమాణ పత్రాలను అందజేశారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రమాణం చేయించారు. సభ్యులను దేవస్థానం ఎస్‌డిసి మధులత సభకు పరిచయం చేశారు.

ఆలయ పవిత్రతను కాపాడాలి: చైర్మన్‌ పూసపాటి
ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో గోవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్న చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను నూతనంగా నియమింపబడిన పాలకమండలి సభ్యులు కాపాడాలన్నారు. తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తితో దైవానికి, భక్తులకు సేవలందించాలన్నారు.