
భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్ప కళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్ కవచాన్ని ధరించబోతోంది. కాలగర్భంలో కలిసిపోకుండా, వాతావ రణ మార్పుల ధాటికి చెదరకుండా ప్రాచీన కట్టడాలను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ నడుం బిగించింది.
ఐఐటీహెచ్ డిజైన్ విభాగానికి చెందిన డాక్టర్ శివాజీ ఆధ్వర్యంలో ఎసాచారి ప్రాజెక్టు ద్వారా కాశీలోని 5 చారిత్రక ఆలయాల డిజిటల్ పరిరక్షణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయాల నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, వాతావరణ మార్పుల ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీహెచ్ పరిశోధకులు వినియోగిస్తు న్నారు. హై రిజల్యూషన్ త్రీడీ డాక్యుమెంటేషన్తో ఆలయాలకు సంబంధిం చిన ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా రికార్డ్ చేయడం, జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్, ఫొటోగ్రామెట్రీ ఆధారంగా భౌగోళిక, నిర్మాణ లెక్కింపులతో కచ్చి తమైన నమూనాలు తయారు చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో భక్తులు, పరిశో ధకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే.. నిజంగా కాశీ ఆలయంలోనే ఉన్నా మనే అనుభూతిని పొందేలా డిజిటల్ నమూనాలను సృష్టిస్తున్నారు.





