News

నిష్కల్మష ప్రజాబంధు ప్రకాశం

4views

( మే 20 – టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి )

దాదాపు అర్ధశతాబ్ది పాటు దక్షిణాది చరిత్రను ప్రభావితం చేసిన ప్రజానేత టంగుటూరి ప్రకాశం పంతులు. దక్షిణాన యావత్‌ ప్రజానీకంతో ప్రకాశానికున్న చొరవ, చనువు, వాత్సల్యం మరెవరికీ లేదు. పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా, కొన్ని సందర్భాలలో పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించాడు.

టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872లో ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంతపతులకు జన్మించారు. ఆరుగురు సంతానంలో ప్రకాశం ఒకరు. 11 సంవత్సరాలకే తండ్రి మరణించడంతో తల్లి పూట కూళ్ల ఇళ్లు నడుపుతూ తన బిడ్డలను సాకింది. ఈయన కూడా వారాలకు కుదిరి రోజుకో ఇంట్లో అన్నం తింటూ చదువుకున్నారు. తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరించడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మనసాక్షిగా వ్యవహరించడం ఆయనకు బాల్యంనుంచే అబ్బిన సహజ లక్షణాలు. లండన్‌లో బారిష్టరు చదువుతున్న రోజులలో సిగార్‌ తాగి చిన్న ఉపన్యాసం ఇవ్వమని చెప్తే తల్లికిచ్చిన వాగ్దానం కోసం ‘నేను పొగత్రాగి ఈ ఉపన్యాసం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పి ఆ దేశంలోనే చరిత్ర సృష్టించాడు.

రాజమండ్రిలో ఉద్దండులను ఓడించి ఛైర్మన్‌ కావడం, మద్రాస్‌లో జడ్జిలను సైతం అపసవ్యంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సవ్యమార్గాన తేవడం, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2,000 మంది ఖైదీలను రాష్ట్ర అవతరణ సందర్భంగా విడుదల చేయడం వంటివి ఆయన సాహసోపేతమైన పనుల్లో మచ్చుకకు కొన్ని. 1907 నుంచి 1921 వరకూ మద్రాస్‌ న్యాయస్థానంలో తొలి తెలుగు బారిష్టర్‌గా, అయ్యర్ల, అయ్యంగార్ల సామ్రాజ్యాన్ని ఛేదించి వారికి ధీటుగా నిలబడి ‘లాడమ్‌’ మ్యాగజైన్‌ కొని న్యాయస్థానంలో జరిగే వక్రమార్గాలను నిర్దాక్షిణ్యంగా విమర్శించి, ప్రచురించి ప్రిన్స్‌ ఆఫ్‌ మద్రాస్‌గా ఖ్యాతి చెందాడు. 1921లో మద్రాస్‌లో లక్షలు సంపాదించే లాయరు వృత్తిని వదిలేసి స్వాతంత్య్రోద్యమంలో దూకిన మొట్టమొదటి ప్రఖ్యాత తెలుగు బారిష్టర్‌ ప్రకాశం కావడం విశేషం.

స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉంటూ అనేక ఉద్యమాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకికెదురుగా గుండె నుంచి ‘ఆంధ్రకేసరి’ అని పేరు పొందారు. జమీందారీ రద్దుకు ప్రకాశం పంతులు ఆద్యుడైనారు. తన సంపాదనను తృణప్రాయంగా వదులుకుని స్వరాజ్య పత్రికను నిర్వహించారు. ఆ పత్రిక ఆ రోజుల్లో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. కాంగ్రెస్‌ సంస్థ అవినీతికి నెలవుగా మారిందని భావించి దాన్నుంచి వైదొలిగి ప్రజా పార్టీ స్థాపించారు. 1952 ఎన్నికల్లో ఆంధ్రదేశమంతటా తిరిగి ప్రముఖులందరినీ ఓడించారు. కర్నూలు రాజధానిగా ఎంచుకోవడంలో పంతులు గారి దూరదృష్టి తొలుత అందరికీ అర్థం కాలేదు. కేవలం 13 నెలల కాలంలో అద్భుత నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. అందులో ముఖ్యమైనవి వేంకటేశ్వర విశ్వ విద్యాలయ స్థాపన, ప్రకాశం బ్యారేజీ, గుంటూ రులో హైకోర్టు స్థాపన, ఖైదీల విముక్తి, రైతులు, చేనేత కార్మికులపై పన్నుల ఎత్తివేత వీటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే.

1957 మే 20న ప్రకాశం కాలధర్మం చేసినప్పుడు ఆయన బద్ద విరోధిగా పేరుపడ్డ కళా వెంకట్రావు ‘నా తండ్రి ఈరోజు గతించాడు’ అనడం ఆ మహనీయుడి కరుణకు తార్కాణం. వారాలు గడుపుతూ చదివి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నతుడు ఆయన. అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శం.