ArticlesNews

కడపలో మత విద్వేషాలకు కుట్ర

29views

ఇటీవల కడపలో ఒక సర్కిల్ పేరు ఏర్పాటుపై జరిగిన ఘర్షణ హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా కనిపిస్తున్నా వాస్తవానికి ఇది ఉగ్రవాదుల పన్నిన కుట్రగా ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘సబ్‌కా సాత్ – సబ్‌కా వికాస’ నినాదంతో అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తోంది. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ ముందుకు వెళ్తోంది. కానీ, సమ్పుాంలో మత ఘర్షణలు ప్రేరేపించి అశాంతిని రేకెత్తించి అస్థిర వాతావరణం సృష్టించి ప్రమాదంలోకి నెట్టేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత పీఎఫఐ, ఎస్‌డీపీపిఐ వంటి కొన్ని నిషేధిత తీవ్రవాద సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆత్మకూరులో మూడేళ్ల క్రితం అక్రమ మసీదు ఘటనలో పోలీసుస్టేషన్ వద్ద వాహనాలను దహనం చేయడం నుంచి ఏడాది క్రితం విజయనగరంలో పేలుడు పదార్థాల స్వాధీనం, నేటి కడపలో మత ఘర్షణల వరకు ఈ తీవ్రవాద సంస్థలే కారణమని విచారణ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చరిత్ర ప్రకారం హిందువులను ఊచకోత కోసిన కర్ణాటక ముస్లిం రాజు టిప్పుసుల్తాన్ విగ్రహాలను, పేర్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసేలా ముస్లింలను ప్రోత్సహించి దానిని హిందువులు వ్యతిరేకించే సమయంలో మతఘర్షణలు చెలరేగేలా దౌర్జన్యాలకు పురిగొల్పడం ఇందులో భాగమేనని అంటున్నారు.

ఉగ్రవాదుల కుట్ర ?

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో  నిషేధిత పీఎఫఐ, ఎస్‌డీపీఐ వంటి కొన్ని తీవ్ర వాద సంస్థలు ఆశ్రయం పొందుతూ మదర్సాల్లో అతివాద, విద్రోహ చర్యల శిక్షణ ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆత్మకూరులో మసీదు అక్రమ నిర్మాణంలో ప్రశ్నించిన బీజేపీ నాయకుడిపై దాడులు, పోలీసు స్టేషన్ ముందు ఆయన వాహనం తగలబెట్టడం వంటి సంఘటనలు తెలిసిందే. ఈ చర్యలపై పోలీసులు చేసిన దర్యాప్తుతో నంద్యాల సమీపంలో పీఎఫఐ, ఎస్‌డీపీఐ సభ్యులు కొందరు… స్థానిక యువతను ఆకర్షించి ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. తర్వాత విజయనగరం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఉగ్రవాదుల సానుభూతిపరులను అరెస్టు చేయడం కలకలం సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడు కడపలో తిష్ఠవేసుకున్న ఈ ఉగ్రమూక స్థ్ధానిక మత రాజకీయాలను ఆసరా చేసుకుని హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా యని ఆరోపణలు వస్తున్నాయి.

మతోన్మాది టిప్పు సుల్తాన్ కీర్తన ఎందుకు?

భారతీయ చారిత్రక పుటలలో టిప్పుసుల్తాన్ ఒక క్రూరాతిక్రూరమైన, మతోన్మాద పాలకుడిగా మిగిలిపోయాడు. తన పాలనలో హిందూ సమాజంపై అకారణంగా దాడులు చేయడం, పవిత్రమైన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, వేలాది మంది హిందువులను బలవంతంగా మతం మార్చడం లాంటి ఎన్నో అకృత్యాలకు పాల్పడిన చరిత్ర అతనిది. భారతీయ జనతా పార్టీ, అనేక హిందూ సంఘాలు స్పష్టంగా చెబుతున్నట్లు.. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన ఒక మతోన్మాది పేరును ప్రజా ప్రదేశాలకు పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది స్థానిక హిందూ ప్రజల  మనోభావాలను తీవ్రంగా గాయపరచడమే. కాని ముస్లింల సంతుష్టీకరణలో భాగంగా టిప్పుసుల్తాన్ పేరును పదేపదే రాష్ట్ర వాతావరణంలోకి జొప్పించి అతన్నో పెద్ద నాయకుడిగా చేసే ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషించాయి. ఇదే క్రమంలో నాలుగేళ్ల క్రితం ప్రొద్దుటూరులో సైతం టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కూడా విఫలయత్నం చేశారు. అప్పట్లో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఏకమై తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేయడంతో హిందూశక్తి ముందు తలవంచి నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. మరల ఇప్పుడు కడప నగరంలో అల్మాస్‌పేట సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టేందుకు ప్రోత్సహించడం, దానిని అనువుగా చేసుకుని మతఘర్షణలకు ప్రేరేపించడం ఉగ్రవాదు లకు అనుకూలంగా మారిందంటున్నారు.

అసత్య ప్రచారం

ఫిబ్రవరి 10న జరిగిన కడప మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో వైసీపీ పాలకమండలి అల్మాస్ సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించి, విపక్షాల అడ్డుకట్టతో విఫలమైంది. వాస్తవానికి, అక్కడ సర్కిల్ పేరు మార్పుపై కేవలం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే తీర్మానం చేశారు. కానీ, ముస్లిం వర్గాలను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో,  కావాలనే  టిప్పు సుల్తాన్ పేరును ఖరారు చేస్తూ తీర్మానం జరిగిపోయిందని వారిని నమ్మించే ప్రచారం చేశారు. దీనికితోడు, కడప కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా పనిచేసిన రాకేశ్ చంద్ర కూడా మైనార్టీ నేతలకు పేరు మార్పు విషయమై ఫోన్‌లో భరోసా ఇవ్వడం, ఆ కాల్ రికార్డింగులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ అంశానికి బలాన్ని చేకూర్చాయి.

కుట్రతోనే హనుమాన్ భక్తులపై రాళ్ల దాడి

ఈ తప్పుడు ప్రచారాల నేపథ్యంలో, రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో హిందూ సంఘాలు ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని శాంతియుతంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఆ కూడలిని ‘హనుమాన్ సర్కిల’గా ఫ్లెక్సీలపై ముద్రించారు. దీనిని అవకాశంగా నిషేధిత చట్ట వ్యతిరేక శక్తులు… హిందూ సంఘాలు హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించిన ప్పుడు రాళ్లు రువ్వేలా ముస్లిం యువతను రెచ్చ గొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శాంతియుతంగా జరగాల్సిన ధార్మిక కార్యక్రమంపై దాడి జరిగింది. కొందరు రౌడీమÖకలు హిందూ సంఘాల వారిని అడ్డగించి, దౌర్జన్యానికి దిగారు. ఏ మాత్రం కనికరం లేకుండా హిందువులపైనా, అడ్డుకోబోయిన పోలీసులపై  రాళ్లు రువ్వి తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు.

జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నవికేత్ విశ్వనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో (విజయవాడ) జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు వెళ్లిన సమయాన్ని చూసి, పక్కా ప్రణాళికతోనే ఈ అల్లర్లకు రంగం సిద్ధం చేశారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణలో సంచలన నిజాలు

కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్, ఎస్పీతో కలిసి అల్మాస్‌పేట సర్కిల్‌ను పరిశీలించారు. అల్లర్లకు పాల్పడిన వారిని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిని గుర్తించడానికి డ్రోన్ కెమెరాలు, వీడియో ఫుటేజీలను వాడుతూ ప్రత్యేక పోలీస్ టీంలు వేట ప్రారంభించాయి. రాళ్ల దాడి, లాఠీఛార్జి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న అల్లరిమూకల్లో పలువురు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు తేలింది. ఆరుగురి వద్ద గంజాయి, మరికొందరి వద్ద డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లు దొరకడం తీవ్ర సంచలనం రేపింది. రాజకీయ పైరవీల కోసమే గంజాయి మత్తులో ఉన్న యువతను వ్యూహాత్మకంగా ఉసిగొల్పారని స్పష్టమవుతోంది.

బాలురను కంచెలా ఉంచి..

అల్మాస్‌పేటలో ఘటనకు ముందు టిప్పుసుల్తాన్ పేరు పెట్టాలని కోరుతున్న వర్గం తమ చుట్టూ వలయంగా కొంతమంది యువతను రంగంలోకి దించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వారు చుట్టూ కంచెలా ఉండటం ద్వారా తమ వద్దకు పోలీసులు రాకుండా ఉంటారనే ఎత్తుగడ వేసినట్లు తేల్చారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కారణమైన వ్యక్తి విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. అతని కోసం ప్రత్యేక నిఘా పెట్టారు.

ప్రభుత్వ – పోలీసుల కఠిన చర్యలు

ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన కడప చేరుకుని ఇరుమతాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.  వైసీపీ అప్పటి పాలకమండలి చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా కలెక్టర్ శ్రీధర్ బట్టబయలు చేశారు. డ్రగ్స్ మూలాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివాదానికి, తప్పుడు ప్రచారానికి పరోక్షంగా కారణమైన ఇన్‌చార్జ్ కమిషనర్ రాకేశ్ చంద్రపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి భావనకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సమగ్ర విచారణ అవసరం

కడపలో జరిగిన ఈ సంఘటన  దాడుల వెనుక, కుట్రలో నిషేధిత మత సంస్థల ప్రమేయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి. సంఘటనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు,  కమ్యూనికేషన్, ప్రణాళిక అంశాలను పరిశీలించాలి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కుట్రలో పాల్గొన్న వారికి మద్దతుగా కోందరి రాజకీయ జోక్యం చేసుకోవడం పై విచారణ జరపాలి చర్యలు తీసుకోవాలి.  అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకునే ఇటువంటి దుష్ట శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి.

తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్