
: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన తమ బంధువు ఆత్మశాంతి కోసం రష్యా నుండి వచ్చిన ఒక కుటుంబం బీహార్‌లోని పవిత్రక్షేత్రం గయాలో పిండప్రదాన కర్మలు నిర్వహించింది. ఈ కార్యక్రమం ఫల్గు నది తీరంలో సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం జరిగింది.
లలిత రాధా రాణి ఫెస్, ఆమె భర్త సుందర ఫెస్ మరియు కుటుంబ సభ్యులు కలిసి లలిత సోదరుడి జ్ఞాపకార్థం శ్రద్ధాకర్మలు నిర్వహించారు. అన్ని వైదిక పద్ధతులను పాటిస్తూ పూజలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యుద్ధంలో తన బావగారి మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని సుందర ఫెస్ పేర్కొన్నారు. గయా క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని, ఇక్కడ పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలకు శాంతి చేకూరుతుందనే విశ్వాసంతో తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
“మా బావగారి, మా తండ్రిగారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించేందుకు గయాకు వచ్చాం. మా కుటుంబంలో శాంతి, సౌఖ్యం, ఐక్యత నెలకొనాలని కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
స్థానిక పూజారి కుమార్ గౌరవ్ ఆధ్వర్యంలో ఈ కర్మకాండలు నిర్వహించబడ్డాయి. రష్యాలో కూడా గయా మహత్యం గురించి ప్రజలకు అవగాహన ఉందని, అందుకే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ పవిత్రక్షేత్రానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హిందూ సంప్రదాయంలో గయాకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఫల్గు నది వద్ద పిండప్రదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించి పితృదేవతలకు నివాళులర్పిస్తుంటారు.





