
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని విజ్ఞాన్ విహార్ స్కూల్‌లో గత 15 రోజులుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శిక్షా వర్గ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ శిక్షా వర్గంలో సాధారణ ప్రథమ వర్ష, విశేష ప్రథమ వర్ష శిక్షణలు నిర్వహించబడుతున్నాయి. సాధారణ ప్రథమ వర్షంలో 239 మంది, విశేష ప్రథమ వర్షంలో 120 మంది వివిధ ప్రాంతాల నుండి పాల్గొంటున్నారు.
ఈ శిక్షా వర్గంలో భాగంగా సార్వజనికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి. రామచంద్ర రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బౌద్ధిక్ ప్రముఖ శ్రీ రామారావు ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పి. రామచంద్ర రాజు మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశం, ప్రజలు, ధర్మం కోసం నిరంతరం సేవలందిస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. భూకంపాలు, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్ నిలుస్తుందని ఆయన అన్నారు. ఇతర సంస్థలు కార్యక్రమాల అనంతరం స్పందించినా, సంఘ్ మాత్రం సంక్షోభ సమయాల్లో తక్షణమే సేవలోకి దిగుతుందని వ్యాఖ్యానించారు.

శ్రీ రామారావు మాట్లాడుతూ, గత 100 సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సాధించిన విజయాలు, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం సంఘ్ సమాజంలో మంచి పరివర్తన, సామాజిక సమరసత, కుటుంబ వ్యవస్థ బలోపేతం, స్వదేశీ భావన ప్రోత్సాహం వంటి ఐదు ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని తెలిపారు.
‘స్వదేశీ, స్వభాష, స్వభావుష’ అనే భావనతో సమాజంలో చైతన్యం తీసుకురావాలని, హిందూ సమాజంలో ఉన్న కుల విభేదాలను తగ్గించి సమరసతతో అందరూ భారతమాత సంతానంగా ఒకే కుటుంబ సభ్యుల్లా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు.





