News

వక్ఫ్ ఆస్తుల జాబితా నుంచి ‘‘లక్షాగ్రహ’’ స్థలం తొలగింపు

0views

యూపీలోని యోగి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్పత్ లోని పురాతన ‘‘లక్షాగ్రహ’’ స్థలాన్ని వక్ఫ్ ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. ఈ స్థలం ముస్లిం శ్మశానవాటిక అంటూ కొందరు పేర్కొన్నారు. అయితే.. యోగి ప్రభుత్వం దీనిని ‘‘లక్షాగ్రహ గానే గుర్తించింది. అంతేకాకుండా 2024 ఫిబ్రవరి 5 నాటి న్యాయస్థాన తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో కీలక నిర్ణయం కూడా జరగనుంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయడానికి మరియు జియో-ట్యాగ్ చేయడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025లో చేపట్టిన ‘UMEED’ (Unified Waqf Management, Empowerment, Efficiency, and Development) పోర్టల్ పాత్రను కూడా వెలుగులోకి తెస్తుంది.

అంతేకాకుండా సరైన పరిశీలన లేకుండా డేటాను నమోదు చేస్తే చారిత్రాత్మకంగా వున్న ముఖ్యమైన ప్రదేశాలపై వివాదాలు ఎలా తెరపైకి వస్తాయో కూడా ఈ వ్యవహారం తెలియజేస్తుంది.

నిజానికి 2025 లో ‘UMEED’ పోర్టల్‌లో ‘లక్షాగ్రహ’ స్థలాన్ని ఒక దర్గాగా నమోదు చేయడం ద్వారా ఈ వివాదం మరింత తీవ్రమైంది.దీనిపై వారసత్వ పరిరక్షణ సంస్థల నుంచి, స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాచీన భారతీయ నాగరికతకు సంబంధించిన ఒక పురాతన కట్టడంగా ఈ స్థలానికి ఉన్న సుదీర్ఘకాలంగా గుర్తింపు పొందిన చరిత్రను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అయితే.. దీని కంటే ముందే బాఘ్ పత్ సివిల్ కోర్టు ఈ స్థలంపై కీలక తీర్పునిచ్చింది.ఫిబ్రవరి 2024 నాటి తన తీర్పులో, ఆ స్థలం నిజంగానే ‘లక్షాగ్రహ’ అని తేల్చింది. ఆ స్థలంలో దర్గా లేదా స్మశానవాటిక వంటి మతపరమైన కట్టడం ఉందని ముస్లిం పక్షం చేసిన వాదనలను కోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పు ఆధారంగా, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయడం వరకే తమ పాత్ర పరిమితమని బాగ్పత్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కైలాష్‌చంద్ తివారీ స్పష్టం చేశారు. తగిన విధివిధానాలను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని ‘UMEED’ పోర్టల్‌లోని వక్ఫ్ ఆస్తుల జాబితా నుండి తొలగించింది.

1970 ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. బర్నవాకు చెందిన ముకీమ్ ఖాన్ అనే వ్యక్తి మీరట్ న్యాయస్థానంలో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఖస్రా సంఖ్య 3377 కింద నమోదైన సుమారు 36 బీఘాల భూమిలో ఒక దర్గా, బద్రుద్దీన్ సమాధి మరియు ఒక శ్మశానవాటిక ఉన్నాయని ఆ పిటిషన్ పేర్కొంది.

దీంతో లక్షాగ్రహం వ్యవస్థాపకులు బ్రహ్మచారి కృష్ణదత్ మహారాజ్.. ఆ వాదనలను సవాల్ చేశారు. 1977లో బాగ్పత్ జిల్లా ఏర్పడిన తర్వాత, ఈ కేసు అక్కడికి బదిలీ అయ్యింది.ఇరు పక్షాలు కూడా తమ తమ వాదనలను వినిపించాయి. దీంతో జూనియర్ డివిజన్ బెంచీ ఫిబ్రవరి 5, 2024న తీర్పు వెలువరిస్తూ, ఆ పురాతన మట్టి దిబ్బను ‘లక్షాగ్రహం’గా పేర్కొంది. దీనిని ముస్లింలు తిరస్కరించారు.
మహాభారత కాలంలో బాగ్పత్‌ను ఏమని పిలిచేవారు?
మహా భారత యుద్ధాన్ని నివారించడానికి పాండవులు దుర్యోధనుడ్ని ఐదు గ్రామాలు ఇవ్వమని అడిగారు. ఆ ఐదూ ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా చుట్టు పక్కల ప్రాంతాల్లోనే వున్నాయి.
ఇంద్రప్రస్థ – ప్రస్తుత ఢిల్లీ (ప్రత్యేకంగా ఇంద్రప్రస్థ ఎస్టేట్/పురాణా ఖిలా సమీపంలో)
స్వర్ణప్రస్థ – ప్రస్తుత సోనిపట్, హర్యానా
పానప్రస్థ – ప్రస్తుత పానిపట్, హర్యానా
వ్యాఘ్రప్రస్థ – ప్రస్తుత బాగ్‌పత్, ఉత్తర ప్రదేశ్
తిలప్రస్థ – ప్రస్తుత తిల్పత్, ఫరీదాబాద్ (హర్యానా
మహాభారతంలో ఈ ఐదు ప్రదేశాల ప్రస్తావన ఉంది. యుద్ధాన్ని నివారించేందుకు తుది రాజీగా ధర్మరాజు ఈ ఐదు ప్రదేశాలను ప్రతిపాదించాడు. దుర్యోధనుడు దీనిని తిరస్కరించడంతో, కురుక్షేత్రంలో ఆ విధ్వంసకర యుద్ధం సంభవించింది.