ArticlesNews

జీవన సమతుల్యతకు మూలస్తంభం తృప్తి

5views

జీవన సమతుల్యతకు మూలస్తంభం తృప్తి. అదొక స్థిరమైన భావం కాదు; సమయం, అవసరం, కోరికలు- ఇవి మారుతున్న కొద్దీ తృప్తి రూపం కూడా మారుతూ ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం తృప్తినిస్తుంది. చలిలో వెచ్చదనం పొందడం తృప్తి. ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా గమ్యానికి చేరుకోవడం తృప్తి. శరీరానికి సౌఖ్యం, మనసుకు సంతోషం, ఆత్మకు ఆనందం కలిగించే ప్రతి అనుభవాన్నీ తృప్తిగా భావించవచ్చు.

తృప్తి మనిషి అంతర్గత స్థితిని ప్రతిబింబిస్తుంది. పుణ్యక్షేత్రంలో స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఎదురుగా నిలబడినప్పుడు భక్తుడికి కలిగే ఆనందం గొప్ప ఆధ్యాత్మిక తృప్తినిస్తుంది. ఆందోళనలు, కోరికలు కొంతసేపు కనుమరుగై, ఒక ప్రశాంత స్థితి కలిగే క్షణమే నిజమైన తృప్తి. ఆదిశంకరాచార్యులు మోహముద్గర స్తోత్రంలో చెప్పినట్లు- ‘మూఢ జహీహి ధనాగమ తృష్ణాం…’ అంటే, ధనం కోసం కోరికను విడిచి, మనసును సద్బుద్ధితో నింపాలి. మనకు లభించినదాంతో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. నిజానికి తృప్తి అనేది బయటి నుంచి వచ్చే దానివల్ల కాదు; అంతర్గత దృష్టి మార్పు వల్ల కలిగేది. ‘యల్లభసే నిజకర్మోపాత్తమ్‌ విత్తం తేన వినోదయ చిత్తం…’ అంటే, మన కర్మల ఫలితంగా వచ్చినదాంతో సంతోషంగా జీవించాలి. ఇది తృష్ణ రాహిత్యానికి దారితీస్తుంది. కోరిక లేకపోతే అసంతృప్తికి తావుండదు. అసంతృప్తి తగ్గితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ‘వివేక చూడామణి’లో చెప్పినట్లు.. బంధాలు, విముక్తి, తృప్తి, ఆరోగ్యం ఇవన్నీ ఎవరికి వారే అనుభూతి చెందాలి. యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతోషంగా ఉండేవాడు ద్వంద్వాలకు అతీతుడు అంటుంది భగవద్గీత. విజయాలు, అపజయాలు రెండింటినీ సమానంగా స్వీకరించే వ్యక్తి నిజమైన తృప్తిని పొందగలడు.

కీర్తి, ప్రతిష్ఠ, ధనం… వీటిపట్ల వ్యామోహానికి అంతుండదు. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది. ఈ చక్రం మనసును అలసటకు గురిచేస్తుంది. అందుకే శాస్త్రాలు ‘శాంతి కన్నా గొప్ప తపస్సు లేదు; సంతోషం కన్నా గొప్ప సుఖం లేదు. తృష్ణను మించిన వ్యాధి లేదు. దయకన్నా గొప్ప ధర్మం లేదు’ అని చెబుతాయి. తృప్తి అనేది కోరికలు లేకపోవడం కాదు. సహజమైన కోరికలు మన జీవితాన్ని నియంత్రించకూడదు. ఉన్నదాన్ని ఆనందంగా స్వీకరించడాన్ని సాధన చేయాలి. కృతజ్ఞతాభావం తృప్తికి మొదటి అడుగు.

అసంతృప్తి వల్ల ఆందోళన, ఒత్తిడి, అసహనం పెరుగుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తృప్తిగా ఉండే వ్యక్తి ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. జీవితాన్ని సానుకూలంగా చూస్తాడు. తృప్తికి సంపదతో, స్థాయితో, పరిస్థితులతో సంబంధం లేదు. అది చూసే మన దృష్టికోణంలో ఉంది. తృప్తి ఉన్న చోటే శాంతి… శాంతి ఉన్న చోటే ఆనందం… ఆనందం ఉన్నచోటే నిజమైన జీవితం ఉంటాయి.