News

రూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్‌’ పట్టివేత

5views

మాదక ద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్‌ తరలిపోకుండా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అడ్డుకుంది. ఈ క్రమంలో తొలిసారిగా రూ.182 కోట్ల విలువైన ‘జిహాదీ డ్రగ్‌’ అని పిలిచే క్యాప్టగాన్‌ (Captagon)ను స్వాధీనం చేసుకుంది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈ విషయాలు వెల్లడిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘డ్రగ్‌ రహిత భారత్’ను నిర్మించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ‘ఆపరేషన్‌ రేజ్‌పిల్‌’లో భాగంగా ఎన్సీబీ భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుకుందని తెలిపారు. ‘జిహాదీ డ్రగ్‌’గా పిలిచే క్యాప్టగాన్‌ డ్రగ్స్‌ను తొలిసారి స్వాధీనం చేసుకున్నారని.. వాటి విలువ దాదాపు రూ.182 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ పశ్చిమాసియాకు తరలిస్తుండగా పట్టుకోవడంతో పాటు ఓ విదేశీయుడిని అరెస్టు చేశారని తెలిపారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్‌ అనే తమ నిబద్ధతకు ఇది ఉదాహరణ అని అభివర్ణించారు. ఈసందర్భంగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేవారికి అమిత్‌షా గట్టి హెచ్చరికలు చేశారు. డ్రగ్స్‌ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఈసందర్భంగా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్సీబీ అధికారులను ఆయన అభినందించారు. ఈ డ్రగ్స్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులోను, దిల్లీలో నేబ్‌సరాయ్‌లలో పట్టుకున్నట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి.