News

అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్‌!

0views

పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే, భవిష్యత్తులో భౌగోళిక చిత్రపటంలో ఉండాలా? లేక చరిత్రలో కలిసిపోవాలా? అనేది పాకిస్థాన్ తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో ‘యూనిఫాం అన్‌వీల్డ్’ నిర్వహించిన ‘సేనా సంవాద్’ కార్యక్రమంలో జనరల్ ద్వివేది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతేడాది ‘ఆపరేషన్ సిందూర్‌’కు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తితే భారత సైన్యం ఎలా స్పందిస్తుందని ఆయన్ను ప్రశ్నించగా, పైవిధంగా ఘాటుగా బదులిచ్చారు. ఉగ్రవాదంపై భారత్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఆయన మాటలు స్పష్టం చేశాయి.

గతేడాది మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ ప్రారంభించాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మన సైన్యం కచ్చితమైన దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా దాడులు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సుమారు 88 గంటల పాటు కొనసాగిన ఈ సైనిక ఘర్షణ, మే 10న ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనతో ముగిసింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ మొదటి వార్షికోత్సవం జరిగిన కొద్ది రోజులకే ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.