
దేవాలయాల్లో దైవ దర్శనం అనంతరం పూజారి భక్తుల తలపై ఉంచే లోహ కిరీటం వంటి పరికరాన్ని శఠగోపం లేదా శఠారి అంటారు. దీనిపై భగవంతుడి పాద ముద్రలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా శఠారిని తలపై ఉంచుకోవడం అంటే దైవ పాదాలను మన శిరస్సుపై ధరించడమే. మనలోని అహంకారాన్ని (శఠం) పోగొట్టి, వినయాన్ని ప్రసాదించేది కాబట్టి దీనికి ‘శఠారి’ అనే పేరు వచ్చింది. దీనిని స్వీకరించే సమయంలో భక్తులు వంగి నమస్కరించడం ద్వారా తమ సర్వస్వాన్ని దైవానికి సమర్పించుకున్నట్టు అవుతుంది. శఠగోపాన్ని రాగి లేదా వెండి వంటి లోహాలతో తయారుచేస్తారు. గర్భాలయంలోని విగ్రహం సమీపంలో ఉండటం వల్ల ఈ లోహపు శఠారి దైవశక్తిని, మంత్రోచ్చారణల వల్ల కలిగే ప్రకంపనలను నిక్షిప్తం చేసుకుంటుంది. దీనిని తలపై ఉంచినప్పుడు, ఆ దివ్య శక్తి భక్తుల శిరస్సులోని ‘సహస్రార చక్రం’ ద్వారా శరీరమంతటా ప్రసరించి మనసును ప్రశాంతంగా మారుస్తుంది- అని వేదపండితులు తెలియజేశారు. శఠగోపం వల్ల మానసిక ఆందోళనలు తొలగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆలయ దర్శనంలో శఠారి ఆశీర్వచనం అత్యంత పవిత్రమైన ఘట్టం.





