News

భోజ్‌శాల ఆలయం హిందువులదే: మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు

30views

దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల వివాదంలో అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్‌ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆలయాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటుచేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.

ఈ ప్రదేశంలో ఎన్నోఏళ్ల పాటు దైవ ఆరాధన కొనసాగినట్లు భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) చేసిన సర్వేలో తేలిందని ధర్మాసనం పేర్కొంది. పర్మార్ వంశానికి చెందిన రాజా భోజ్‌తో సంబంధం ఉన్న సంస్కృత విద్యాకేంద్రంగా ఇది ఉండేదని పలు చారిత్రక సాహిత్యాలు రుజువు చేస్తున్నాయని పేర్కొంది. మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం ముస్లిం వర్గాలకు సూచించింది. ఇందౌర్‌ ధర్మాసనం తీర్పు నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భోజ్‌శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్‌ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. 2003 ఏఎస్ఐ (ASI) ఒప్పందం ప్రకారం, హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రదేశంలో ఆరాధన కోసం ప్రత్యేక హక్కులు కోరుతూ హిందూ వర్గం ఈ ఒప్పందాన్ని హైకోర్టులో సవాలు చేసింది. ఆలయ స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాలు వాదించాయి. దీంతో ఈ ప్రాంతంలో 2024లో 98 రోజుల పాటు పురావస్తు శాఖ సర్వే నిర్వహించి 2024 జులై 15న కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ బెంచ్‌ నేడు విచారణ జరిపింది.