News

కరాచీలో ‘పసూరి’ భరతనాట్యం నృత్యకారిణి షీమా కెర్మాణిపై పోలీసుల దౌర్జన్యం

32views

ప్రసిద్ధ ‘పసూరి’ మ్యూజిక్ వీడియో ఫేమ్, 75 ఏళ్ల క్లాసికల్ నృత్యకారిణి, మహిళా హక్కుల కార్యకర్త షీమా కెర్మాణిని పాకిస్తాన్ సింధ్ పోలీసులు కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల బలవంతంగా అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పాకిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న పితృస్వామ్య హింసకు వ్యతిరేకంగా ప్రతిఏటా నిర్వహించే ‘ఔరత్ మార్చ్’ కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఆమె ఇతర కార్యకర్తలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సింధ్ మహిళా పోలీసులు వృద్ధురాలైన షీమా కెర్మాణిని కారులో నుండి బలవంతంగా లాగి, రోడ్డుపై ఈడ్చుకుంటూ వాహనంలోకి ఎక్కించారు. పోలీసులు తనను లాగుతున్న సమయంలో ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, తాను 75 ఏళ్ల వృద్ధురాలినని, తనతో ఇలా దురుసుగా ప్రవర్తించవద్దని ఆవేదనతో అరవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్, పాకిస్తాన్ సహా అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. పాకిస్తాన్‌లో పౌర హక్కులు, మహిళల భావప్రకటన స్వేచ్ఛ పూర్తిగా కుంచించుకుపోతున్నాయని పౌర సమాజం నుండి తీవ్ర ఒత్తిడి పెరగడంతో సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు షీమా కెర్మాణిని, ఇతర కార్యకర్తలను పోలీసులు కాసేపటికే విడుదల చేశారు. అలాగే సీనియర్ నృత్యకారిణి పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ముగ్గురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.