ArticlesNews

వేసవి ఎండల నుంచి మూగజీవాలు, పక్షులను కాపాడేందుకు కృషి నీరు, ఆహారం ఏర్పాటు

32views

రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భగభగ మండే వేసవిలో నీరు, ఆహారం లభించక విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అమరావతి నగరానికి సమీపంలోని ఛత్రి తలావ్, భాన్‌ఖేడా అటవీ ప్రాంతాల్లోని పక్షులు, మూగజీవాల దాహార్తిని, ఆకలిని తీర్చేందుకు ‘ఏక్ కదమ్ మానవతా కీ ఓర్’ అనే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ ‘పశుపక్షి దాణా-పానీ అభియాన్’ పేరిట మూగజీవాలకు ఆహారం, నీటిని అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం అనేక మందిలో స్ఫూర్తిని నింపుతోంది.

గత 13-14 సంవత్సరాలుగా ఈ అటవీ ప్రాంతంలో నివసించే జంతువులు, పక్షులకు నీరు, ఆహారం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడటానికి ‘ఏక్ కదమ్ మానవతా కీ ఓర్’ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ ఏడాది జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన మహేష్ ముల్చందాని ఈ మహోద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రకృతి, వన్యప్రాణులు, అటవీ సంరక్షణ పట్ల ఆయనకు అంకితభావం ఉంది. దీంతో మూగజీవాల దాహార్తి, ఆకలిని తీర్చే ఈ కార్యక్రమానికి ఇప్పుడు మున్సిపల్ యంత్రాంగం నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

పౌరులు సైతం సేవలో భాగం
ఛత్రి తలావ్ ప్రాంతంలోని అటవీ మార్గాల వెంట ‘ఏక్ కదమ్ మానవతా కీ ఓర్’ సంస్థ ఏకంగా 700-800 నీటి తొట్టెలను ఏర్పాటు చేసింది. వివిధ చెట్ల కొమ్మలకు వేలాడదీసిన నీటి పాత్రలు, రహదారి వెంట ఉంచిన పెద్ద నీటి తొట్టెలు, పక్షుల కోసం ప్రత్యేకంగా అందించే ధాన్యం ద్వారా ఈ అటవీ ప్రాంతమంతటా ఒక విశిష్టమైన ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో నాలుగు చేతి పంపులు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే వారు స్వచ్ఛందంగా నీటిని తోడి ఆయా నీటి పాత్రలను నింపుతున్నారు. అనేకమంది పౌరులు తమ సొంత ఇళ్ల నుంచి పెద్ద నీటి పాత్రలను తీసుకువచ్చి ఈ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.

పక్షుల కోసం జొన్నలు, ధాన్యం ఏర్పాటు
వేసవిలో అడవి ఎండిపోవడంతో పక్షులకు సహజంగా లభించే ఆహార వనరులు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రదేశాల్లో పక్షుల కోసం ప్రత్యేక ఆహార పాత్రలను ఏర్పాటు చేశారు. పౌరులు ఈ పాత్రల్లో జొన్నలు, బియ్యం, ఇతర ధాన్యాలను నింపి ఈ సేవలో పాలుపంచుకుంటున్నారు. తద్వారా వేసవి నెలల్లో పక్షులకు నీరు, ఆహారం రెండూ అందుబాటులో ఉంటుంది. అడవిలోని పర్యావరణ ఆహార గొలుసును కాపాడటంలో ఈ కృషి కీలక పాత్ర పోషిస్తోంది.

‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ తరాలు సేఫ్‌గా’
కొవిడ్ మహమ్మారి సమయం మనకు ప్రకృతి విలువను తెలియజేసిందన్నారు పర్యావరణ ప్రేమికుడు, కార్పొరేటర్ మహేశ్ ముల్చందాని. నేడు చెట్ల సంఖ్య తగ్గిపోతుండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు చెట్లనైనా నాటాలని పిలుపునిచ్చారు. మూగ జీవాలకు నీరు అందించడమే నిజమైన మానవత్వామని పేర్కొన్నారు. ప్రజలు అటవీ ప్రాంతాల్లో చెత్త వేయడం, నదులు, వాగులను కలుషితం చేయడం మానుకోవాలని కోరారు. చాలా మంది తమ ఇంట్లోని వ్యర్థాలను, పెళ్లిళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి స్థానిక వాగుల్లో పారవేస్తుంటారని, ఇటువంటి చర్యలు ఈ స్వచ్ఛమైన సహజ పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రకృతిని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. మనం ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ తరాలు సురక్షితంగా ఉంటాయని అన్నారు.

చూపరులను ఆకట్టుకుంటున్న జంతువులు, పక్షులు
అమరావతి నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతానికి వాకింగ్ కోసం వచ్చే పౌరులకు తరచుగా జింకలు, అడవి పందులు, నక్కలు, కుందేళ్లు, వివిధ రకాల పక్షులు కనిపిస్తుంటాయి. చాలా మంది సందర్శకులకు ఈ అడవుల్లో సంచరించే చిరుతపులులను చూసే అవకాశం కూడా లభిస్తుంది. జింకలు, నెమళ్లు ఒకే చోట నీరు తాగడానికి గుమిగూడే దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. నగర జీవితపు హడావిడికి దూరంగా ఈ ప్రశాంత వాతావరణంలో నడవడం, పక్షుల కోసం నీటి పాత్రలను నింపడం తమకు అపారమైన మానసిక సంతృప్తిని ఇస్తుందని ఈ ప్రాంతంలోని చాలా మంది నివాసితులు పేర్కొన్నారు.

“నేను ప్రతి రోజూ సాయంత్రం వాకింగ్ చేయడం కోసం ఈ ప్రాంతానికి వస్తాను. సాయంత్రం 5-7 గంటల మధ్య అడవిలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నీటి పాత్రలన్నింటినీ నింపుతాను. పక్షులకు నీరు అందించడం నాకు ఎంతో మానసిక సంతృప్తిని ఇస్తుంది. వేసవి నెలల్లో పక్షులకు నీటి లభ్యత అత్యంత కీలకం. ఈ ప్రాంతానికి వచ్చే ఇతర సందర్శకులు కూడా ఈ మంచి కార్యక్రమానికి మద్దతిస్తున్నారు. పక్షులు, మూగజీవాలకు నీటిని, ఆహారాన్ని అందించడం ప్రశంసనీయం.” అని వాకింగ్ వచ్చే ప్రదీప్ బాంబల్ తెలిపారు.