
శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగు చూసింది. దిల్లీకి చెందిన ఆనంద్‌కుమార్ శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసీ గదులను ఓ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేలు చెల్లించారు. శనివారం 27 మంది దిల్లీవాసులు హైదరాబాద్ నుంచి ఓ టూరిస్ట్ బస్సులో శ్రీశైలం వచ్చారు. మల్లికార్జున సదన్‌లో గదుల కోసం సంప్రదించగా అక్కడ గదుల బుకింగ్ జరగలేదని తెలిసింది. దీంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులను లక్ష్యంగా చేసుకొని నకిలీ వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
సైబర్ మోసంపై స్పందించిన దేవస్థానం ఈవో
దిల్లీ యాత్రికులకు జరిగిన సైబర్ మోసంపై శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పందించారు. యాత్రికులకు అండగా నిలిచారు. వారికి ఉచిత వసతి, భోజనం, దర్శన ఏర్పాట్లు చేయించారు. భక్తుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదును దేవస్థానం పీఆర్‌వో తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల మోసం కేసు పెట్టాలని ఈవో శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు.





