
33views
కాకతీయుల చరిత్రను ప్రతిబింబించే శతాబ్దాల నాటి శిథిల శివాలయం రాత్రికి రాత్రే నేలమట్టమైంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ లో చారిత్రక శివాలయం వుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రాత్రి కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చేశాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం తమకు తెలియని అధికారులు పేర్కొనడం గమనార్హం. అధికారులకు తెలియకుండా ఇంతటి పురాతన ఆలయాన్ని ఓ కాంట్రాక్టర్ కూల్చేస్తాడా? అంటూ భక్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఇది చారిత్రక ఆలయం అని రుజువులు కూడా వున్నాయి. 1213 లో కాకతీయ రాజు గణపతిదేవుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయం చుట్టూ మట్టికోట కూడా వుంది.కాకతీయుల శాసనం వుందని కూడా అంటున్నారు. అయితే.. కాల క్రమంలో కొంత భాగం కూలింది. 70 ఏళ్లుగా పూజలు కూడా జరగడం లేదు. దీనిని పునర్నిర్మించాలని స్థానికులు పురావస్తు శాఖ అధికారులను కోరగా.. పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఎలాంటి ముందడుగు పడలేదు.
కానీ… తాజాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అంటూ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతో శాసన రుజువులు కూడా పోయాయి. మరో వైపు కలెక్టర్, ఎమ్మెల్యే దీనిని సందర్శించారు. యథా స్థానంలో ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.





