
భారతీయ సమాజం అన్న భావన పాశ్చాత్య సమాజం కంటే మౌలికంగా చాలా భిన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘సోషల్ కాంట్రాక్ట్’’ కంటే ఏకత్వం,పరస్పర సహకారం, కర్తవ్యం, బాధ్యతలపైనే భారతీయ నాగరిక చింతన ఆధారపడి వుంటుందని వివరించారు. మైసూరులోని జేఎస్ఎస్ మహా విద్యాపీఠంలో ‘‘జాతీయ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా సామాజిక సమరసత’’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. అలాగే ‘‘ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ’’ అన్న పుస్తకాన్ని సుత్తూరు క్షేత్ర పూజ్య సద్గురు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీతో కలిసి విడుదల చేశారు.
భారతీయ సమాజం పోటీపై కాకుండా, సహకారం, సమన్వయంపై ఆధారపడి వుంటుందన్నారు. అంతా ఒక్కటేనని, ఈ సత్యాన్ని గ్రహించడంవల్ల శాశ్వత ఆనందం లభిస్తుంది కానీ, అది కూడా ఓ బాధ్యతను సృష్టిస్తుందన్నారు.అందరూ ఒక్కటే అయినప్పుడు ప్రతి ఒక్కరి శ్రేయస్సు పరస్పరం ముడిపడి వుంటుందన్నారు.
పాశ్చాత్య భావనలో జీవన పోరాటం వుంటుందని, దీని ద్వారా బలహీనుల ఓటమితో బలవంతులు బతికేస్తారన్నారు. కానీ భారతీయ సమాజంలో బలవంతులు ఇతరులు బతకడానికి సహాయపడతారన్నారు. ఇక్కడ పేదలు, నిరక్షరాస్యులు, బలహీనులు కూడా బతుకుతారని, దైనందిన జీవితంలో స్ఫూర్తిని ప్రతిబింబిస్తారన్నారు. భారతీయ సమాజం అంటే కేవలం ప్రజల సమూహం కాదని, అనుభవాలు, ఉమ్మడి పరిసరాలు, ఐక్యతా భావంతో శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న ఓ సంఘం అని అభివర్ణించారు.
ఇక.. పాశ్చాత్య దేశాలు రాజ్యం, ప్రభుత్వం, రాజకీయ సరిహద్దుల ద్వారా నిర్వచించబడతాయని, అయితే.. భారత దేశంలో భూభాగమే జాతీయ గుర్తింపుకు ఆధారమన్నారు.ఆ భూమే శ్రేయస్సను, పర్వతాలు, సముద్రాల ద్వారా సహజ రక్షణను, శాంతియుత వాతావరణాన్ని అందించిందన్నారు. ఈ స్థిరత్వమే ప్రజలు ఆధ్యాత్మిక వివేకం కోసం తమ అంతరాత్మలోకి చూసుకునేలా చేసిందన్నారు.
ధర్మం అనేది కేవలం న్యాయానికి మాత్రమే పరిమితం కాదని, అందరికీ సామరస్యాన్ని, ఆనందాన్ని అందించే ఓ సూత్రమని భాగవత్ అన్నారు. ధర్మానికి కేంద్ర బిందువు కరుణ అని, ఈ కరుణ ఏకాత్మ భావన నుంచి ఉద్భవిస్తుందన్నారు.నిజమైన అభివృద్ధిని కేవలం భౌతిక సంపద ప్రాతిపదికన మాత్రమే కొలవలేమని, అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, పురోగతి అనేది కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరాలని సూచించారు. భారతదేశ దృక్పథం “సర్వే భవంతు సుఖినః” అనే సూత్రంపై మరియు సమిష్టి శ్రేయస్సుపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.





