
త్రిశూలం, శివలింగం, శివపార్వతులు ఇలాంటి మరెన్నే భక్తి బొమ్మలు.. వేప పుల్లనే కుంచెగా మలుచుకుని క్షణాల్లో కళాత్మకంగా గీస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇదేలా సాధ్యమంటే.. శ్రీశైలేశుడు ప్రసాదించిన కళ అంటారు ఆ చిత్రకారులు. ఇల కైలాసమైన శ్రీగిరిలో భక్తుల వాహనాలపై ఆధ్యాత్మిక చిత్రాలు గీస్తూ వందమందికిపైగా జీవనోపాధి పొందుతున్నారు.
శ్రీశైల క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలపై అధ్యాత్మిక చిత్రాలు వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.దీంతో శ్రీశైలంలోని వివిధ ప్రదేశాల్లో వాహనాల పై భక్తి బొమ్మలు వేయడం వృత్తిగా చేసుకున్నారు. చకచకా పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల వాహనాలను శుభ్రం చేసి వాటి అద్దాలపై అధ్యాత్మిక బొమ్మలు గీస్తారు. వేపపుల్లను కుంచెగా చేసుకొని విభూది, కుంకుమ, నీలం, అకుపచ్చ నంగులను ఉపయోగిస్తూ త్రిశూలం, శివలింగం, శివపార్వతులు, పుష్పాలు, మయూరం తదితర చిత్రాలు వేస్తారు. వారి కళను మెచ్చి వాహనదారులు ఎంతోకొంత డబ్బులు ఇస్తారు. సాధారణ రోజుల్లో కంటే రద్దీ రోజులైన శని, ఆది, సోమవారాల్లో వాహనాల్లో భక్తులు అధికంగా వస్తారు. ఆ సమయంలో చిత్రకారులకు చేతినిండా పని ఉంటుంది.
12 సంవత్సరాల నుంచి వాహనాలపై బొమ్మలు వేయడాన్ని వృత్తిగా చేసుకున్నాను. మా బొమ్మలను మెచ్చి భక్తులు ఇచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పెద్దగా చదువుకోని మేము శ్రీశైలం మల్లికార్జున స్వామినే నమ్ముకుని జీవిస్తున్నాము. ఆయనే మాకు చిత్రకారుడిగా మార్చి ఉపాధి చూపుతున్నాడు.– చందు నాయక్, చిత్రకారుడు
అధ్యాత్మిక బొమ్మలు గీయడానికి మేము పెద్ద ఆర్టిస్టులము కాదు. మాకు ఎవరు గురువులు లేరు. ఒకరిని చూసి మరొకరం నేర్చుకున్నాం. స్వామి దయ వలన ఆయన సన్నిధికి వచ్చే భక్తుల వాహనాలపై చిత్రాలు గీసి జీవనోపాధి పొందుతున్నాం. కొంత మంది భక్తులు మా కళను మెచ్చుకున్నప్పుడు ఎనలేని సంతోషం కలుగుతోంది.– సతీష్, చిత్రకారుడు





