News

సముద్రగర్భంలోని ద్వారకలో కోట.. శాస్త్రవేత్తల ప్రకటన

40views

శ్రీకృష్ణుడు పరిపాలించిన పురాతన రాజధాని ద్వారక. దీనిన ద్వారవతి లేదా దేవభూమి అంటాం. మహాభారత కాలం నాటి ఈ నగరం, కృష్ణుని నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది. నేడు ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ద్వారకాధీశ ఆలయం వుంది. అంతేకాకుండా పురావస్తు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున జరిపిన అన్వేషణల్లో ప్రాచీన నిర్మాణాల అవశేషాలు, గోడలు వున్నట్లు తేల్చారు.

అంతేకాకుండా తాజాగా మరో విషయాన్ని కూడా భారత పురావస్తు శాఖ కనుగొంది. ‘‘అండర్ వాటర్ ఆర్కియాలజీలో కొన్ని అద్భుతాలు బయటపడ్డాయి. ద్వారక తీరంలో గాలి ద్వారా కాకుండా నీటి అడుగున జరిపిన పరిశోధనల వివరాలను ఏఎస్ఐ శాస్త్రవేత్తలు వివరించారు.పురావస్తు శాఖ అధికారులు అనేక ఏళ్లుగా ఈ ప్రాంతంలో వినూత్న పద్ధతుల్లో పరిశోధనలు జరిపారు. సముద్రంలోపల 360 నుంచి 735 అడుగుల లోతు వరకు ఏరియల్ సర్వే చేసి సుమారు 20 కిలోమీటర్ల మేర శాస్త్రవేత్తలు జల్లెడ పట్టారు. దీని ద్వారా పలు నగరాల ఉనికిని పురావస్తు శాఖ వారు గుర్తించినట్లు సమాచారం బయటపడింది. ఇది ప్రధానంగా కోట లాంటి నిర్మాణం మాదిరిగా కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ కోటలో అద్భుతమైన నిర్మాణ శైలిని గమనించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కోట లోపల లోతైన బావులు, మెట్లు, అలాగే ప్రాచీన కాలంలో వాడిన ఈ నగరానికి సంబంధించిన మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. కోటలో కత్తులు, కవచాలు, ప్రాచీన కాలం నాటి రక్షణకు సంబంధించిన అనేక వస్తువుల ఆచూకీ లభించింది. సోనార్ సాంకేతికత ద్వారా ఈ ప్రాంతం కింద సుమారు 20 మీటర్ల పొడవు ఉన్న రహదారిని కూడా గుర్తించారు. అంతేకాకుండా రోమన్ రాజ్యానికి సంబంధించిన కొన్ని పురాతన నాణేలను కూడా కనుగొన్నారు. అక్కడ లభించిన వస్తువులపై విదేశీ ముద్రలు ఉండటం ఆశ్చర్యకరమని ఏఎస్ఐ పేర్కొంది. మొత్తం మీద ఈ ప్రాచీన నగరానికి సంబంధించి సుమారుగా 10 వేల పురాతన వస్తువులను పరిశోధన ద్వారా సేకరించడం జరిగిందని అధికారులు తెలిపారు.

అయితే.. 2025 లో సుందర ద్వారకపై ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) మరోసారి అధ్యయనం చేస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఎస్‌ఐ అనుబంధ విభాగమైన అండర్‌వాటర్‌ ఆర్కియాలజీ వింగ్‌(యూఏడబ్ల్యూ) అరేబియా సముద్రంలో శోధనలు ప్రారంభించింది. కృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన మరిన్ని విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నిస్తున్నది.

ద్వారక నగరాన్వేషణ పురావస్తు శాస్త్రవేత్తలకు నిత్యం ఒక కుతూహలాన్ని కలిగిస్తుంది. 1930లలో మొదటిసారిగా హిరానంద్‌ శాస్త్రి ద్వారక రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జేఎం నానావతి, హెచ్‌డీ సంకాలియా ఆధ్వర్యంలో మొదటిసారిగా ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969-70, 1983-1990 మధ్య సముద్రగర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువులను సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరగా 2005-07లోనూ యూఏడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్వేషణ జరిగింది. వీరంతా సముద్రగర్భంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు.