
విజయవాడలో సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 3న నారద మహర్షి జయంతిని పాత్రికేయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉత్తమ పాత్రికేయులు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక కార్టూనిస్టుకు జాగృతి పూర్వ సంపాదకులు వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక అవార్డులను ప్రదానం చేశారు.
సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు తన ప్రసంగంలో నారద జయంతి ఉత్సవ ఆలోచన 20 సంవత్సరాల క్రితం ఎలా ప్రారంభమైందో వివరించారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించేందుకు పాత్రికేయులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే సంకల్పంతో ఈ అవార్డులను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే వడ్లమూడి రామ్మోహన్ రావు గారి పేరిట అవార్డు ఇవ్వడం వెనుక ఉన్న నేపథ్యాన్ని సవివరంగా వివరించారు.
ప్రధాన అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఎస్.ఏ.వి. ప్రసాద్ రావు జర్నలిజంలో వచ్చిన మార్పులపై మాట్లాడారు. సమాజానికి సేవ చేసే స్వచ్ఛంద భావనతో కూడిన జర్నలిస్టుల అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యుగంధర్ తన ప్రసంగంలో ఆధునిక మీడియాలో వస్తున్న కథనాలు సమాజంపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించారు. దేశభక్తి, కుటుంబ విలువలు, వాస్తవాధారిత సమాచారాన్ని ప్రజలకు అందించే కొత్త తరహా జర్నలిజం అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సాహితీ సుధా ఫౌండేషన్ నారద జయంతి 2026 ఉత్తమ పాత్రికేయులుగా ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్‌వర్క్ ఇంచార్జ్ టీవీ బి. బాబు బహదూర్, దూరదర్శన్ విజయవాడ కేంద్ర కరస్పాండెెంట్ చెందిన జర్నలిస్టు కె. నవీన్, రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ (విశాఖపట్నం) ఆర్. నరేంద్ర, ఉత్తమ కార్టూనిస్టుగా అన్నం శ్రీధర్ (బాచి)లను సత్కరించారు. వారికి రామ్మోహన్ రావు స్మారక మోమెంటోతో పాటు నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించగా, కృష్ణారెడ్డి వందన సమర్పణ చేశారు. శ్రీమతి సీతారత్నం బృందం వందేమాతరం గేయంతో సభ ప్రారంభమై, జనగణమన ఆలాపనతో ముగిసింది.



