News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన..

10views

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరాముడి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు ప్రయత్నించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆలయ నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆలయాన్ని అత్యంత పటిష్టంగా, నాణ్యమైన కృష్ణ శిలతో సుమారు 8 దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నట్లు రఘురామకృష్ణ రాజు వెల్లడించారు.

ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన ముహూర్తం విశేషాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ఒక మంచి ముహూర్తం చూడాలని తాను వేణుగోపాలరావును కోరగా.. మే 3వ తేదీ ఉదయం 7.14 గంటలకు అత్యంత బలమైన ముహూర్తం ఉందని సూచించారని తెలిపారు. దీనిపై తాను ఇతర పండితులను కూడా సంప్రదించి మరో ముహూర్తం చూడాలని కోరగా.. వారు కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ ముహూర్తానికే శంకుస్థాపన జరిగి తీరుతుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు.

అయితే, ఈ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో కొందరు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని, మరికొందరు ఇంకా కేసులు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని రఘురామ మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు వేసినా ఆలయ నిర్మాణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనుకున్న ముహూర్తానికే శంకుస్థాపన చేశామని, త్వరలోనే ఆలయాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆలయంపై వదంతులను ఖండించిన రఘురామ..
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ పనులపై వస్తున్న వదంతులను ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఆలయ ప్రాంగణంలో పండితులు సూచించిన ముహూర్తానికి అనుగుణంగానే పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. దశమి ఘడియల్లో పనులు మొదలై, ఏకాదశి ఘడియల్లో పూర్తయ్యేలా ఏప్రిల్ 26న తెల్లవారుజామున 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించామని, అదే రోజు ఉదయం 11:25 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసిందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. “అర్ధరాత్రి వేళ రహస్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు” అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన వినమ్రంగా తెలియజేశారు. ఆలయ శంకుస్థాపన పనులన్నీ మధ్యాహ్నం వరకు అందరి సమక్షంలో బహిరంగంగానే, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్మాణ పనులన్నీ పూర్తిగా చట్టబద్ధంగా, సంబంధిత అధికారుల ముందస్తు అనుమతులతోనే జరుగుతున్నాయని రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. రెవెన్యూ అధికారులు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అది రామాలయమేనని నిర్ధారించిన తర్వాతే.. మున్సిపల్ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని ఈ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆకివీడు స్థానికులంతా దీనికి సహకరిస్తుండగా, బయట ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు వచ్చి అపార్థాలకు దారితీసేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ప్రజలెవరూ వాటిని పట్టించుకోకుండా శాంతి, ఐక్యతలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.