News

మదర్సాల్లో బంధుప్రీతి, ఆర్థిక అవకతవకలు, నకిలీ అటెండెన్స్

13views

యూపీ ప్రభుత్వంతో ఆర్థిక సాయం పొందుతున్న మదర్సాల పనితీరుపై పెద్ద వివాదమే రేగుతోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మోసాలు, నకిలీ అటెండెన్స్, పిల్లల హక్కుల ఉల్లంఘనలతో సహా అనేక అవకతవకలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో ఆరోపించారు. దీంతో వివాదం రేగింది. దాదాపు యూపీలోని 500 మదర్సాల విషయంలో ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. దీని ద్వారా మదర్సా వ్యవస్థల్లో ఎన్ని లోపాలున్నాయో… తెలిసిపోతోందని పలువురు అంటున్నారు.

అంతేకాకుండా ప్రియాంక్ కనూంగో మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మదర్సాల్లో అనేక నియామకాలు జరిగాయని, దేశంలో కఠినమైన ఆంక్షలున్న సమయంలో 300 కు పైగా ఉపాధ్యాయులను నియమించుకున్నారని కనూంగో పేర్కొంటున్నారు. దీంతో ఉపాధ్యాయుల నియామకాలపై చట్టబద్ధమైన సందేహాలను రేకెత్తిస్తోంది.

‘‘దేశమంతటా కోవిడ్ లాక్ డౌన్ నడుస్తోంది. అలాంటి క్లిష్టమైన సమయంలో మదర్సాలలో 300 కి పైగా ఉపాధ్యాయులను నియమించుకున్నారు. అయితే… వారంతా ఉపాధ్యాయులే కాదు. మాకు ఫిర్యాదులు కూడా అందాయి. ఇది విద్యార్థుల హక్కును ఉల్లంఘించడమే. ఈ నియామకాలన్నీ అక్రమమే. అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకున్నారు.దీంతో విద్య నాణ్యతపై అనుమానాలు వస్తున్నాయి’’ అని కనూంగో మండిపడ్డారు.

మరో వైపు కనూంగో మరో కీలక విషయాన్ని కూడా బయటపెట్టారు. మదర్సాల వ్యవస్థల్లో మొత్తం బంధుప్రీతే వుంటుందన్నారు. ఒకే కుటుంబం నుంచి ఐదారుగుర్ని ఉపాధ్యాయులుగా నియమించుకున్నారని ఆరోపించారు.”మదర్సాలలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు నుంచి ఆరుగురు ఉపాధ్యాయులుగా ఉన్నారు,” అని ఆయన అన్నారు. కొందరు నిర్దిష్ట వ్యక్తులకు అనుకూలంగా నియామక ప్రక్రియలలో రాజీకూడా పడ్డారన్నారు. అలాగే ఓ మదర్సాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడే, మరో మదర్సాలో కూడా పనిచేస్తున్నట్లు తమకు సమాచారం కూడా అందిందన్నారు. ఇది మోసమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే మదర్సాల్లో జరుగుతున్న మరో కీలకమైన మోసాన్ని కూడా బయటపెట్టారు. ఆ సంస్థల్లో హిందువుల పిల్లలను చేర్చుకొని, వారికి ఇస్లామిక్ పరమైన అధ్యయనాల్లో శిక్షణ కూడా ఇస్తున్నారన్న సమాచారం తమకు అందిందన్నారు.ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న NHRC, ఆరోపించబడిన ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. నకిలీ విద్యార్థుల హాజరు, మోసపూరిత ఉపాధ్యాయ నియామకాలు మరియు ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.