
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలేనికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుచేయాలని సిఫార్సు చేస్తూ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు జేసీ భావన నేతృత్వంలోని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ నివేదిక అందజేసింది. ఆనంద్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన ఎస్సీ సర్టిఫికెట్ కలిగి ఉండటానికి అర్హుడు కాదని కలెక్టర్‌కు జేసీ కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మీ ఎస్సీ సర్టిఫికెట్‌ను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పాస్టర్ ఆనంద్‌కు కలెక్టర్ నోటీసు జారీచేశారు. కలెక్టరేట్లో ఈ నెల 19న తుది విచారణ నిర్వహించనున్నారు. తర్వాత ఆయన ఎస్సీ సర్టిఫికెట్ రద్దుపై రాజ్యాంగ నిబంధనలు, ఆధారాలను బట్టి కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీచేస్తారు. క్రైస్తవమతంలోకి మారిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన అక్కల రామిరెడ్డి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఫిర్యాదుపై స్పందించిన జేసీ కమిటీ ఇద్దరికీ నోటీసులు జారీచేసి గత నెల 16న తొలి దశ విచారణ నిర్వహించింది. ఆనంద్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నెల ఒకటిన మరోసారి విచారణ నిర్వహించగా.. కమిటీ వద్దకు రామిరెడ్డి, ఆనంద్ హాజరై తమ వాదనలు వినిపించి పత్రాలు అందజేశారు.




