News

పబ్లిక్‌ స్థలాల్లో నమాజ్‌ హక్కేమీ కాదు

6views

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ నిర్వహణపై అలహాబాద్‌ హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. పబ్లిక్‌ స్థలాల్లో సామూహిక నమాజ్‌ చేయడం సంపూర్ణ హక్కేమీ కాదని, ప్రజాభద్రత దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. పబ్లిక్‌ స్థలాన్ని ఏ ఒక్క వ్యక్తిగానీ, గ్రూపుగానీ కేవలం నమాజ్‌ సహా, మత కార్యకలాపాలకు వినియోగించలేదని పేర్కొంది. అది శాంతిభద్రతలు, ఇతరుల హక్కులకు లోబడి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ సరళ్‌ శ్రీవాత్సవ, జస్టిస్‌ గరిమా ప్రసాద్‌ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పబ్లిక్‌ స్థలంలో నమాజ్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సంభల్‌ జిల్లా గున్నౌర్‌ తాలూకా, ఇకౌనాకు చెందిన ఆసిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. పబ్లిక్‌ స్థలంపై అందరికీ సమాన హక్కులు ఉంటాయని, కేవలం ఏ ఒక్కరో దాన్ని ఉపయోగించుకుంటామంటే అందుకు చట్టపరంగా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరికైనా ప్రజా భద్రతకు లోబడే మతాన్ని ఆచరించే హక్కు ఉంటుందని, ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఆ హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఇది ప్రయివేటు స్థలాలకూ వర్తిస్తుందని తెలిపింది. ప్రయివేటు కార్యక్రమాలైనప్పటికీ సాధారణ ప్రజానీకంపై అవి ప్రభావం చూపినప్పుడు వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.