
నంద్యాల జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభిక మరియు ప్రాథమిక శిక్షణ వర్గాలు విజయవంతంగా ముగిశాయి. స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల (శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల) ప్రాంగణంలో ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఈ శిక్షణ శిబిరం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
ముగింపు సందర్భంగా నిర్వహించిన సమారోప సభలో కర్నూలు విభాగ్ సహబోధ్ ప్రముఖ్ శ్రీ విప్రనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంఘటిత శక్తియే దేశానికి అసలైన రక్ష. యువత ఐక్యంగా, క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొన్నారు. దేశభక్తి భావనతో యువత సమాజానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో స్వయం సేవకులకు శారీరక మరియు బౌద్ధిక పరమైన శిక్షణ అందించారు. వ్యాయామం, యోగా, నియుద్ధ వంటి శారీరక కార్యక్రమాలతో పాటు దేశభక్తి, భారతీయ సంస్కృతి, సామాజిక బాధ్యతలపై బౌద్ధిక బోధనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్, కార్యవాహ, శిక్షణ వర్గ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొన్నారు.





