ArticlesNews

ఎండిన నదిని పునరుజ్జీవింప చేసిన మహిళా శక్తి

28views

దాదాపు 20 వేల మంది మహిళా వాలంటీర్లు…  చేయీ చేయీ కలిపారు. కొంగు బిగించారు. క్షేత్రంలోకి దిగారు. ఎండిన నదిని పునరుజ్జీవింప చేశారు.

మిళనాడులోని వెల్లూరు జిల్లాలోని నాగనతి లేదా నాగనాడి నది… ఒకప్పుడు గలగలా ప్రవహించేది. ఎండిపోయి దాదాపు అంతరించే స్థితికి చేరుకుంది. ఈ విషయం ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌ నెలకొల్పిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నదుల పునరుజ్జీవన ప్రాజెక్టు’ నిర్వాహకుల దృష్టికి వచ్చింది. ఆ నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో యోగ, సుదర్శన క్రియలు నేర్పిస్తోన్న ఈ సంస్థ… మహిళలంతా సంఘటితమై నదిని బతికించేలా చేసింది.

రాళ్లు మోశారు… బావులు తవ్వారు!

ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన కార్మికుల భాగస్వామ్యంతో గ్రామీణ మహిళలు నడుం బిగించారు. యంత్రాల సాయం లేకుండా కేవలం తమ శక్తినే నమ్మి, అత్యంత కష్టమైన పని చేశారు. రాళ్లను మోశారు. వెల్లూరు జిల్లాలోని కణియంబాడి బ్లాక్‌లో 5,462 రీఛార్జ్‌ బావులు, 1,084 చెక్‌ డ్యామ్‌లు నిర్మించారు. దాంతో భూగర్భ జలమట్టం మీటరు నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగి, నాగనాడి నదికి జీవం పోసింది. ఏటా మూడు పంటలు పండించుకోగలుగుతున్నారు. దాదాపు ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. మహిళలకు ఆర్థిక భద్రత లభించింది.

ఉదాహరణకు కమ్మవాన్‌ పేటకు చెందిన ప్రజలు ఒక దశలో తీవ్ర నీటికొరతతో వ్యవసాయం లేక  నిరాశలో కూరుకుపోయారు. మగవాళ్లు మద్యానికి బానిసలయ్యారు. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులో భాగంగా చేతులు కలిపారో అప్పటి నుంచి తమ జీవితాల బాగుకోసం తామే స్వయంగా పనిలోకి దిగారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ అందించిన స్ఫూర్తితో మహిళలు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి సిమెంట్‌ రింగులు తయారుచేసుకున్నారు. బావులు తవ్వి, ఆ రింగుల్ని అమర్చడం నుంచి మూతతో బావి మూయడం వరకూ అన్ని దశల్లోనూ పని చేశారు. మొదట్లో అంత లోతు బావులు తవ్వగలమని వాళ్లూ అనుకోలేదు. కానీ పనిలోకి దిగాక ఎంతో ఉత్సాహంగా పూర్తిచేశారు. నది పునరుద్ధరణ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. చిన్న తరహా వ్యాపారం చేసుకుంటూ వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేసింది.

ప్రధాని ప్రశంస!

2014లో ప్రారంభించి నాలుగేళ్లలో సుమారు 366 చదరపు కిలోమీటర్ల మేర నదీ పరీవాహక ప్రాంతాన్ని పునురుద్ధరించారు అక్కడి మహిళలు. వెల్లూరులోని జవధు కొండల సమీపంలో ఉన్న అమిర్తి ప్రాంతంలో ఉద్భవించిన ఈ నది, సుమారు 48 కి.మీ. మేర ప్రవహించి చివరకు చెయ్యార్‌ నదిలో కలుస్తుంది. 21 పంచాయతీల గుండా ప్రవహించే ఇంత పొడవైన నదిని పునరుద్ధరించడం కష్టసాధ్యం. అలాంటిదాన్ని సాధ్యం చేసి చూపించారక్కడి మహిళలు. అంతేకాదు, పునరుద్ధరణ జరిగిన నాటి నుంచీ ఈ నది ప్రవహిస్తూనే ఉంది. వీళ్ల కృషిని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ వందో ఎపిసోడ్‌లో మూడోసారి ప్రశంసించడం ఈ మహిళలకు గర్వకారణం. అంతేకాదు, మరెన్నో నదుల పునరుద్ధరణకీ దీన్ని మోడల్‌గా తీసుకుంటున్నారు. ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రివర్‌ రెజువనేషన్‌ ప్రాజెక్ట్స్‌లో భాగంగా మొదలైన ఈ క్రతువు… నేడు ఎన్నో గ్రామాలను పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయడం నిజంగా గొప్ప విషయమే కదూ!