News

భారత్‌పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర!

4views

భారత గడ్డపై మరో భారీ ఉగ్రదాడికి పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని, ఈసారి జమ్మూకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ ను ప్రతీకార దాడులకు పురిగొల్పి, ఆ తర్వాత అమెరికా వంటి దేశాల జోక్యాన్ని కోరడం ద్వారా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనేది పాక్ పన్నాగంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యూహం వెనుక పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ వ్యక్తిగత, రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.

దేశీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న అసిమ్ మునీర్, తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి భారత్‌పై ఒక పెద్ద దాడిని ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా నిలిచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలన్న ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన దృష్టి మళ్లీ భారత్‌పైకి మళ్లింది. కశ్మీర్ అంశాన్ని రగిలించడం ద్వారా పాకిస్థాన్‌లో తన ఇమేజ్‌ను పెంచుకుని, భవిష్యత్తులో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనేది ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక అని ఓ అధికారి తెలిపారు.

ఇందుకోసం మునీర్ రెండంచెల వ్యూహంతో ముందుకెళుతున్నారు. మొదటి దశలో, కశ్మీర్‌లోని స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి, చిన్నచిన్న దాడులు చేయించడం ద్వారా లోయలో అశాంతిని సృష్టించడం. దీనివల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో పాటు సరిహద్దుల్లో మోహరించిన భారత భద్రతా బలగాల దృష్టిని అంతర్గత భద్రత వైపు మళ్లించవచ్చు. రెండో దశలో, ఈ అదను చూసి సరిహద్దుల్లోని లాంచ్‌ప్యాడ్‌లలో సిద్ధంగా ఉన్న పెద్ద సంఖ్యలోని పాక్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించి, ఒక భారీ దాడికి పాల్పడటం వారి వ్యూహంలో భాగం.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అది తమ అంతర్గత వ్యవహారమని భారత్ గట్టిగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ చేత సైనిక చర్యకు ఆస్కారం కల్పించి, దానిని సాకుగా చూపి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకునేలా చేయాలన్నదే మునీర్ అసలు లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసినా ఫర్వాలేదన్న తెగింపుతో మునీర్ ఉన్నారని, ఆయనకు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడమే ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.