News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

5views

భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆవును తక్షణమే జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, వనవాసీ కళ్యాణ ఆశ్రమ నేతలు డిమాండ్‌ చేశారు.

అల్లూరి సీతారామరాజు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్‌,  సమరసత ఫౌండేషన్ – ఎస్‌ఎస్‌ఎఫ్‌, వనవాసి సంఘాల ఆధ్వర్యంలో గోసంరక్షణ, రామాలయ భూముల రక్షణకై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. గోమాత పరిరక్షణతో పాటు, ముంచంగిపుట్టులోని స్థానిక రామాలయానికి చెందిన భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌ భాస్కర అప్పారావుకు నేతలు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండ కార్యవాహ  మదన్‌ మోహన్‌ కుమార్‌, ఎస్‌ఎస్‌ఎఫ్‌ మండల కన్వీనర్‌ కిముడు రఘునాథ్‌, వనవాసి మండల ప్రముఖ్‌ జన్ని జగన్నాథం మాట్లాడుతూ ఈ క్రింది డిమాండ్లను లేవనెత్తారు.

పవిత్రమైన గోవులను వధిస్తున్న వారిపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని మరియు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రామాలయానికి చెందిన భూములను అక్రమంగా ఆక్రమించిన వ్యక్తులపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శ్రీరామ భక్తులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొని గోసంరక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు.