ArticlesNews

ఆరెస్సెస్ రాజకీయాలకు, అధికార శక్తికి ఎందుకు దూరంగా వుంటుంది?

7views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ్ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అయితే… సంఘ్ ఇంత విస్తరించినా.. రాజకీయ శక్తిగా ఎందుకు మారాలని అనుకోవడం లేదని తరుచూ సంఘ కార్యకర్తలను, ప్రచారకులను, సర్ సంఘచాలక్ ని కొందరు అడుగుతూ వుంటారు. నిజానికి సంఘ్ రాజకీయ రంగం వైపు ఎందుకు వెళ్లాలని అనుకోవడం లేదో ఒకసారి పరిశీలిద్దాం.
అధికారం ద్వారా ఏర్పడ్డ ఐక్యత చాలా తొందరగా నశించిపోతుందనే విషయం మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్న సత్యం. గత అనుభవం ఈ నాటి అనుభవం కూడా ఇదే. అత్యాధునిక సమాజ నిర్మాణంలో ఆర్థిక సమానత్వం సాధించడానికి అధికార ప్రయోగం జరిగింది. ఈ విషయంలో అతిశ యోక్తితో రష్యాను వర్ణిస్తారు. కానీ వాస్తవ స్థితి వేరు. మానవ సమాజం పట్ల ప్రేమానురాగాలు గల ఒక నిష్కామ కర్మయోగి, త్యాగి,ఓ మహా పురుషుడు ప్రపంచ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ‘‘జనాలు రష్యాను ఇంతగా ఎందుకు పొగుడుతున్నారో నాకర్థం కావడం లేదు’’ అని అన్నాడు. అది నందనవనం కాదు, దాని వెనకాల పరుగెత్తనవసరం లేదు. అధికారం లభించిన తర్వాత దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అప్పుడు తాను ‘‘అధికారి’’ గా మిగతా వారంతా బానిసలనే భావన ఏర్పడుతుంది. అక్కడ స్వప్రేరణతో పనిచేసే శక్తి కూడా నశించిపోతుంది.
సమానత్వం కూడా ప్రపంచం యొక్క విచిత్ర జీవితంలో కనబడలేదు. అందువల్ల ఆ ప్రయోగం విఫలమైపోయింది. ఇప్పుడది కేవలం అందమైన వాక్యాలతో సామ్రాజ్యకాంక్షను పెంచే సాధనంగా వుండిపోయింది. మనిషిలో ఒక శ్రేష్ఠమైన జీవనాన్ని ఉత్పన్నం చేసే కార్యం కేవలం అధికారం ద్వారా జరగదు. ఎవరికైతే అధికారం మీద ఆశలేదో, వాళ్లంతా దు:ఖాన్ని అనుభవిస్తూ, కష్ట జీవితాన్ని గడుపుతూ సమాజ హితం కొరకు పనిచేస్తున్నారు. వారితోనే సమాజధారణ జరిగింది.
అధికారంతో మదం, అనాచారం పెరిగి వ్యవస్థకు బదులు అవ్యవస్థ ఏర్పడుతుంది. ఆర్థిక విషమత వల్లనే సమాజంలో దౌర్బల్యం ఏర్పడింది. సామాన్యంగా ప్రజలు కూడా ఇదే సమస్యను ముందుంచుతారు. మానవ సమాజాన్ని పీడకులు, పీడితులు అనే రెండు వర్గాలుగా విభజించారు. పూర్వం ప్రజలు మొదట దైవాన్ని, కర్మను ఆరాధించేవారు. కానీ ఈనాడు దైవానికి బదులుగా ద్రవ్యాన్ని ఆరాధిస్తున్నారు. దానినే కేంద్రంగా చేసుకొని సమాజంలో వ్యాపించి యున్న అవ్యవస్థకు ‘‘డబ్బే’’ కారణమని చెబుతున్నారు. భారతదేశంలో ఈ రకమైన భయంకర వైషమ్యం వుందా? కొందరి ధనవంతుల ధనం కూడా ప్రపంచంలోని ధనికులతో పోల్చుకుంటే దేనికీ పనికిరాదు. ఇక్కడ మాత్రం ధనవంతుడు మొదలుకొని దరిద్రుని వరకు అందరికీ ఒకే మెట్టు వుంది. సమాజంలో స్పష్టంగా రెండు వర్గాలున్నాయని చెప్పడం ప్రజలను భ్రమలో పడేయడమే. సమాజాన్ని ముక్కలుగా చేసే చెడు నీతి పరిణామమే యిది. ఇప్పటి వరకు జరిగిన ముస్లిం, నాన్ ముస్లిం మొదలగు శబ్దాల ప్రయోగం లాంటిదే యిది. విదేశీ నినాదాలను ఆధారంగా చేసుకొని ఈ భేదాన్ని కలిగిస్తున్నారు. రెండు వర్గాలు వాటి మధ్య సంఘర్షణ కూడా శాశ్వతం కాదు. ఒకవేళ సంఘర్షణ జరిగినప్పటికీ వాటి మధ్యనున్న భేదం తొలిగిపోయి భేదరహిత సమాజ నిర్మాణం జరగదు. మరి ఏకాత్మతా ఎలా ఏర్పడుతుంది?
అధికార లాలస కూడా ప్రేరణనిస్తుంది. గతంలో బౌద్ధం, ఇస్లాం ప్రచారం కూడా ప్రభుత్వం ద్వారానే జరిగింది. ఈ రోజు కూడా హిందుత్వానికి అనుకూలం కాని విషయాలు అధికారం ద్వారానే జరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఏసుక్రీస్తుకు వ్యతిరేకంగా రాజ్యాధికారం మొత్తం పనిచేసింది. ప్రజలు కూడా వ్యతిరేకంగా వున్నారు. క్రీస్తును శిలువకు వ్రేలాడదీసిన తర్వాత అతని శిష్యులకు మార్గదర్శనం చేసే వారు కూడా లేకుండాపోయారు. కానీ ప్రజల హృదయాలలో ధ్యేయం, శ్రద్ధ వున్నాయి. కాబట్టి వారు విస్తరించారు. వారి దగ్గర అధికారం లేదు. అధికారం కొరకు ఎప్పుడైతే వారు ప్రయత్నాలు ప్రారంభించారో వాళ్లలో లంచగొండితనం వ్యాపించింది. ఇదే విధంగా బౌద్ధ సామ్రాజ్యం కూడా ఏర్పడింది.
హిందూ జీవన విధానాన్ని ముక్కలు ముక్కలు చేసి బుద్ధ భగవానుని పేరు మీద సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. జీవితం మీద శ్రద్ధ నశించిపోయింది. కానీ అధికారంలో వున్న ఆ బౌద్ధ సంప్రదాయాన్ని ఏ అధికారమూ లేని శ్రీ ఆదిశంకరులు కనిపించకుండా చేశారు. శంకరాచార్యుడు సంస్కృతిని ఆధారంగా చేసుకొని దేశం మొత్తంలో శక్తిని జాగృతం పరిచి బౌద్ధ సంప్రదాయాన్ని లేకుండా చేశారు. సాధారణ ప్రజలు వ్యతిరేకించినప్పటికీ బుద్ధి, శ్రద్ధ, కార్యదక్షత పట్టుదలతో ఆయన విజయాన్ని సాధించారు. అధికారానికి కూడా వారి ద్వారా చైతన్యం కలిగింది. ఒక విశిష్ట రాష్ట్ర జీవితాన్ని చిరంజీవిగా వుంచేందుకు ప్రయత్నించిన వారి మనస్సులో ఎప్పుడైతే అధికారం పట్ల ప్రేమ కలిగిందో భ్రష్టులై నశించిపోయారు. రాష్ట్రం యొక్క సమగ్ర కల్పనతో ముందుకు పోయేవాడు సంప్రదాయాలు మొదలగు విషయాలను క్షుద్రమైనవిగా భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తమైన అంత:కరణ గలవాడు వీటిపట్ల శ్రద్ధ చూపరు.
రాజ్యాధికారం మీద జీవితం ఆధారపడి వున్నట్లయితే పరాయివాళ్ల ఆక్రమణ జరుగగానే మనం పతనమై పోయేవాళ్లం. కానీ పరాయి వాళ్లు వచ్చారు, వెళ్లిపోయారు. గజనీ, ఘోరీ, తుగ్లక్ మొగలులు, ఫ్రెంచి వాళ్లు, ఆంగ్లేయులు అందరికందరు వెళ్లిపోయారు. మనమే వున్నాం. ఎందుకంటే మనమే మన సమాజానికి ప్రధానమైన సంస్కృతిని స్వీకరించాం. అది ఈనాటి వరకు వుంది.మనం ఈ సంస్కృతి ధారను మేల్కొల్పి వున్నంత కాలం మనం జీవించి వుంటాం. ఇది గనక మనస్సులో వున్నట్లయితే హిందూ రాష్ట్రాన్ని ద్వేషించే వారికి అధికారం వచ్చినట్లయితే మనం బతుకుతామో లేదోననే భయం అవసరం లేదు.జీవితం ప్రధానమైన గత పురుషార్థ పూర్ణ ప్రయత్నమే స్వయంసేవకుల ఆశాకేంద్రం.
ప్రజలంతా సంస్కృతిని ఒప్పుకున్నట్లయితే ఎవరి రాజ్యం ఏర్పడుతుంది? ఒకవేళ ఇది నిజమైనట్లయితే సంపూర్ణ సమాజం సఫలీకృతం అవుతుంది. చేతులు ముడుచుకొని కూర్చుంటే సరిపోదు. వాస్తవ సత్యాన్ని సరియైన ఆధారాన్ని మరిచిపోయి ఇసుక మీద భవనాలు నిర్మిస్తే సంఘకార్యం జరగదు. మనవాళ్ల అధికారం వుండి అది దృఢంగా లేనట్లయితే ప్రజలు ఎలాంటి ఆలోచన, సిద్ధాంతాన్ని వ్యక్తపరుస్తారు? మన సంస్కృతి అనుభవం ఆధారంగా శక్తిని సంపాదించుకోకుండా అధికారాన్ని చేపట్టినట్లయితే ఆత్మీయ భావన వ్యక్తమవుతుందా?
అధికారాన్ని చూసి కాదు, సామర్థ్యాన్ని చూసి ప్రజలు హిందూ సంస్కృతిని పూజిస్తారు. ఈనాడు స్వదేశీ సంస్కృతి వ్యతిరేకులు కూడా దానిని స్వీకరిస్తారు. దేశంలో సంస్కృతిపై ఆధారపడిన చైతన్యాన్ని కలిగిస్తూ దాని క్షేమాన్నే కోరుకుంటాం. భారత్ లో ప్రతి కార్యం మీద సంఘ ప్రభావం వుండాలంటే మౌళికమైన చిరంతన కార్యాన్ని స్వీకరించాలి. సూర్యుని వెలుతురుతో చంద్రుడు ప్రకాశించినట్లుగానే ప్రజల వెలుతురుతోనే అధికారానికి వులుగు, జీవితం లభిస్తుంది. సూర్యునిలోని ప్రభావవంతమైన చైతన్యవంతమైన శక్తిమాదిరిగా స్వయంసేవకులు కూడా ప్రజా సర్వస్వమై, వారి ఆశయాకాంక్షలకు సాకారమూర్తులమైనప్పుడు ఆ ప్రజా వెలుతురుతో వెలిగే అధికారం ఎలాంటి వెలుతురు ఇస్తుంది?
దీనికి సంబంధించి ఉపనిషత్తులో ఓ కథ కూడా వుంది. రాక్షసులను ఓడించి విజయాన్ని సాధించిన తర్వాత దేవతలలో తాము చాలా శక్తి సంపన్నులమనే మదం పెరిగింది. అప్పుడు భగవంతుడు వాళ్ల మదాన్ని తొలగించాలని ఆలోచించి ఒక విశాలమైన విగ్రహంగా ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. అతడు ఎవరో వారికి అర్థం కాలేదు. అతని గురించి తెలుసుకోవడానికి వాయువు, అగ్ని వచ్చారు. వాళ్లు తెలుసుకోలేక వెళ్లిపోయారు. వాయువు తన ప్రభంజనం గురించి, అగ్ని తాను దేనినైనా భస్మం చేయగలనని తమ తమ శక్తి సామర్థ్యాల గురించి చెప్పుకున్నారు. కానీ ఆ యక్షుడు వారి ముందుంచిన గడ్డిపోచను వాయు దేవుడు లేపలేకపోయాడు. అగ్ని దేవుడు దానిని కాల్చలేకపోయాడు. చివరికి ఇంద్రుడు వెళ్లాడు. ఇంద్రుడు వెళ్లగానే యక్షుడు అదృశ్యమయ్యాడు. ఇంద్రుడు కూడా ఆ యక్షుని రహస్యాన్ని తెలుసుకోలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆ యక్షుడు ఎవ్వరో కాదు భగవంతుని శక్తి అని ఆ శక్తి వల్లనే దేవతలందరికీ శక్తి లభిస్తుందని తెలుసుకున్నాడు.
ప్రత్యక్షంగా కనిపించే సమాజం శక్తి అప్రత్యక్షంగా వుంటుంది. దానిని ప్రజలు గుర్తించలేదు. శక్తి యొక్క కేంద్ర స్థానమేదో ప్రజలు అర్థం చేసుకోలేరు. అధికారం ఆకాశం నుంచి రాలిపడదు. అది ప్రజా సామర్థ్యం నుంచి వెలువడుతుంది. మనుషుల మధ్య నుండే ఒక మనిషి అధికారాన్ని గ్రహిస్తాడు. హిందూ సంస్కృతిని బట్టే భారతదేశం యొక్క అదృష్ట నిర్ణయం జరుగుతుంది. ఈ దృష్టి ఉన్నట్లయితే కుర్చీ మీద ఎవరు కూర్చున్నా, ఎవరు రాజైనా పర్లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లిపోయాయి. కానీ సాంస్కృతిక దృష్టిగలవారు తమను తాము రక్షించుకున్నారు. మొగలుల రాజ్యంలో హిందూ ప్రజల రక్షణ కోసం అధికారాన్ని హెచ్చరించేవాడు లేనప్పుడు, అందరూ విదేశీ అధికారాన్ని స్వీకరించినప్పుడు, ప్రలోభాలు మరియు ఒత్తిళ్ల మధ్య హిందువును అహిందువుగా మార్చే ప్రయత్నం జరుగుతున్న సమయంలో హిందువులు ఏవిధంగా బతికారు? వారు కేవలం తమ బలం మీదనే జీవించారు. సాంస్కృతిక అధిష్టాన్ని ఆధారం చేసుకొని, శ్రీరామచంద్రుని, శ్రీ కృష్ణుడ్ని కీర్తించుకుంటూ జీవన పరంపరను కాపాడుకుంటూ, శ్రద్ధా భక్తులు కలిగి వుంటూ పతనా వస్థలో కూడా నైతిక స్వరాన్ని వీడకుండా వున్నారు.
అంతా ఇదే విధంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు చేసే శ్రేష్ఠపురుషుల పరంపర వందల సంవత్సరాలు నడించింది. అలాంటి సమయంలో సాంస్కృతిక అధిష్ఠానాన్ని స్వీకరించి, రాజ్యాధికారాన్ని ఎవరో ఒక్కరు స్థాపించారు. ఉదాహరణకు శివాజీ వెనకాల వున్న పరంపరనే చూద్దాం. జ్ఞానేశ్వర్ నుండి మొదలు తుకారం వరకు జరిగిన ధార్మిక ప్రచారం వల్ల ఏర్పడిన చైతన్యం ద్వారా ఓ వాతావరణం ఏర్పడింది. దాని ఆధారంగానే శివాజీ వెలుగులోకి వచ్చాడు. ఎవరి అధిష్ఠానం దృఢంగా వుంటుందో అతడు చిరజీవన సాక్షిగా నిలబడతాడు. ఆరెస్సెస్ కూడా పోటీ వరుసలో నిలబడితే స్వయంసేవకులు శ్రేష్ఠ జీవితాన్ని వదిలి పతన స్థితికి వచ్చేస్తారు. వారికి ప్రశంసలు అవసరం లేదు. అందుకే చాలా సార్లు సంఘ ప్రచారకులు, స్వయంసేవకులు ఫోటోలకు, ప్రశంసలకు చాలా దూరంగా వుంటారు. ఒక సంస్థగా అధికారాన్ని చేపట్టి, మిగతా వారిని బానిసలుగా తయారు చేయాలనే భావన సంఘ్ లో లేదు.స్వయంసేవకుల్లో సంపూర్ణ రాష్ట్రం యొక్క ఏకాత్మ భావన వుంటుంది.
‘‘ద్వితీయాదేవ భయం భవతి’’ అని అంటారు. ఏ ఉద్దేశంతో భారత దేశాన్ని విశ్వగురువుగా తయారుచేయడానికి ఆరెస్సెస్ పూనుకుందో, ఆ ఉద్దేశం పట్లే శ్రద్ధ చూపుతుంది.జ ఒక వేళఅధికారం అన్న తుపానులో కొట్టుకొని పోతే, ఏదీ నిలవదు. సంఘ్ నిలకడగా వుంటే తుపానును జీర్ణించుకొని భారత దేశం తన సంపూర్ణ ఐశ్వరంతో నిల్చుంటుంది. స్వయంసేవకులు వుంటే దేశం వుంటుంది. సంఘ్ లేకుంటే భారత్ పేరు కూడా వుండదు. అందుకే సంఘ్ ప్రతి సారీ తన లక్ష్యం గురించి పునశ్చరణ చేసుకుంటుంది. ప్రతి గాలి తాకిడికి చలించిపోతే సంఘ కార్యం ముందుకు సాగదు.
హిమాలయాల లాగా దృఢంగా వుండాలని సంఘ్ లో పదే పదే స్వయంసేవకులకు చెబుతారు. గంగా, యమున లాంటి పరిశుద్ధమైన ధారలను ప్రవహింపచేయడం కుదురుతుందని చెబుతుంటారు. అయితే.. ఇలా వుండడానికే స్వయంసేవకులందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. మూర్తులం అవుదామా? మూర్తి నిర్మాతలం అవుదామా? ఆలోచించుకోవాలని చెబుతుంటారు. విఘటన పద్ధతులకు బానిసలం అయిపోతే సంఘ కార్యం జరగదని సంఘ్ ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యం ఏకాత్మ భావనతోనే జరుగుతుంది. నీచమైన పోటీ తత్వానికి దూరమైతేనే అది సాధ్యం. ఈనాడు ఇతరులు భారత్ ని ఆర్థికంగా, బౌద్ధికంగా బానిసను చేయడానేికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ స్వయంసేవకులు కడూా భారతీయ దృష్టిని విడిచిపెట్టేస్తే స్వచ్ఛమైన ‘‘స్వ’’ అనే జ్ఞానం ఎలా కలుగుతుంది?
అసంపూర్ణమైన శక్తికే కష్టాలు. పూర్ణ శక్తికి కష్టాలు రావని స్వయంసేవకుల విశ్వాసం. ఏకాత్మత ఆధారంగా పూర్తిగా నైతిక విలువలతో శక్తిని ఒకే సూత్రంతో సంఘటితపరిస్తే దాని దగ్గరకు ఎలాంటి కష్టమూ రాదు. పరాయి అధికారంతో పోరాటం సాగించడానికి మాధవాచార్యులు సిద్ధపడ్డారు. కానీ తాను స్వయంగా గుడిసెలోనే వుండేవారు. ఎవరు అధికారాన్ని చేపడతారన్న ప్రశ్నే ఉదయించదు. మనం ముందుకు పోదామా? లేదా? అని మాత్రమే సంఘ్ చూస్తుంది. అప్పుడే దేశం చిరంజీవిగా నిలబడుతుందని సంఘ్ విశ్వసిస్తుంది. ప్రతి వ్యక్తిలో శుద్ధమైన శీలాన్ని, నిస్వార్థత, ఏకాత్మ అనుభూతిని నింపితే సమాజం మారుతుందని, అప్పుడు ఈ సామర్థ్యాలు సంపూర్ణ సమాజ హితాలను రక్షిస్తుందని సంఘ్ విశ్వసిస్తుంది.