News

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

18views

‘గురుదేవా.. దీవించవా’.. ‘మీ దరికి చేరామయ్యా.. మమ్మల్ని కాపాడవయ్యా..’అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన తెల్లవారుజామున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠంలోని విరాట్‌ నగర్‌లో విజయవాడ వారు ఏర్పాటు చేసిన శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి నిత్య అన్నదాన విశ్వబ్రాహ్మణ సేవా సమాజం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం మహా నైవేద్య పూజ కార్యక్రమాన్ని మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణం చేశారు.

వైభవంగా నరనంది ఉత్సవం

రాత్రి నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి నరనంది వాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. ఉత్సవానికి బద్వేలు నియోజకవర్గం రామాపురంలోని నీరొద్దుల పాపయ్య కుమార్తె వెంకటమ్మ ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను పారాయణం చేశారు. రాత్రి పాల రామాంజనేయులు భాగవతార్‌ ప్రదర్శించిన హరికథ అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మఠం మేనేజర్‌ ఎన్‌.ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో సిబ్బంది, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో పీపీఎన్‌ ప్రసాద్‌, దత్తాత్రేయస్వామి తదితరులు పాల్గొన్నారు.