News

విజయవాడలో ఘనంగా ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ

45views

విజయవాడ సమాలోచన ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో డా. బొమ్మరాజు సారంగపాణి రచించిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రధాన ప్రసంగం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రజానీకం తమ సాంస్కృతిక వారసత్వం విలువను గుర్తించలేని పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ‘భావదాస్యమూలాలు’ వంటి గ్రంథాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే జేమ్స్ మిల్, టి.బి. మెకాలే వంటి విదేశీ రచయితలు భారతదేశ గొప్పతనం తెలిసినా, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే చరిత్రను మనకు అందించారని విమర్శించారు. తన ప్రసంగంలో అనేక ఉదాహరణలతో విషయాన్ని శ్రోతలకు సులభంగా వివరించారు.

సభ ప్రారంభంలో డా. వడ్డి విజయసారథి మాట్లాడుతూ, భారత చరిత్రలో అందుబాటులో లేని కాలఖండాలపై సమాచారాన్ని సేకరించి, అనువాదాలు మరియు స్వతంత్ర రచనల రూపంలో పాఠకులకు అందించే కృషిని నవయుగ భారతి సంస్థ కొనసాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా శరద్ హెబాల్కర్, డా. సారంగపాణి, వి.వి. సుబ్రహ్మణ్యం, పులిచెర్ల సుబ్బారావు, వినాయక దామోదర్ సావర్కర్ తదితర రచయితల పలు గ్రంథాలను ఆయన ప్రస్తావించారు.

రచయిత డా. బొమ్మరాజు సారంగపాణి గారి పరిచయం సందర్భంగా ‘గంగలో విషనాగులు’, ‘బంగ్లాదేశ్ హిందువుల నరమేధం’, ‘ఆర్థికరంగము – దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు’ వంటి రచనలను ప్రస్తావించారు. అదేవిధంగా శ్రీమతి ఎస్తేర్ ధనరాజ్ రచించిన ‘Unbaptised’ గ్రంథ ప్రచురణలో సారంగపాణి గారి సహకారం ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, రచయిత డా. బొమ్మరాజు సారంగపాణి, నవయుగ భారతి కార్యదర్శి నేతి క్షీరసాగర్‌లను సభ నిర్వాహకులు సత్కరించారు. కె. రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో విజయవాడతో పాటు గుంటూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుండి మేధావులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.