
ఎవరైనా భారత మాతను ఆరాధించాలనుకుంటే అందరూ భారత్ గా మారిపోవాలని, ఇందుకోసం భారత్ ను అర్థం చేసుకోవాలని, దేశాన్ని గౌరవించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.శ్రీ అబాజీ థట్టే సేవా, పరిశోధనా సంస్థ పక్షాన భారత్ దుర్గా శక్తి స్థల్ ప్రాజెక్టుకు సంబంధించిన శంకు స్థాపనా కార్యక్రమం మహారాష్ట్ర జామ్ లోని నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్, అఖాడా పీఠాధీశ్వరుడు ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరీజీ, స్వామి గోవింద్ దేవ గిరీజీ మహారాజ్, స్వామి మిత్రానంద మహారాజ్, బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రీ, సాధ్వీ రితింభర, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ ప్రపంచంలో సత్యాన్ని ప్రచారం చేయాలంటే శక్తి కావాలని (సామాజిక, రాజకీయ) కానీ.. భారత్ లో ఆ శక్తి అవసరమే లేదని తేల్చి చెప్పారు. కానీ.. ఎవరి దగ్గర లాఠీ వుంటుందో వారి అధికారం’’అనే చందంగా ఇతర దేశాల్లో వుంటుందన్నారు. నాగపూర్ లో భవ్యమైన భారతమాత దుర్గ ఆలయంనిర్మిస్తున్నారని, దాని నిర్వహణ కోసం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే.. ఈ ఆరాధన కేవలం ఈ ఆలయానికే పరిమితం కావొద్దని, భారత్ అంతటా ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ ఈ ఆరాధన జరగాలని సూచించారు. 150 ఏళ్ల పరాధీనత కారణంగా మన మనస్సులు, మేధస్సుపై పాశ్చాత్య పొరలు కమ్ముకున్నాయన్నారు.ఈ పొరలను తొలగించాలని, దైనందిన పనుల నుంచి మొదలు పెడితే జాతీయ సమస్యల వరకు మనమందరమూ భారత దేశంగా మారిపోవాలన్నారు.ఈ పనిని చిన్న చిన్న విషయాలతో ప్రారంభించాలని, ఈ దిశగా కార్యోన్ముఖులమవుతే నిస్సందేహంగా లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
ప్రస్తుత ప్రపంచపు పోకడలను, పరిస్థితులను ప్రతి ఒక్కరూ గమనిస్తూనే వున్నారని, అయితే మన దేశం విశ్వగురువుగా అవతరిస్తుందా? అన్న సందిగ్ధంలో కొందరు వున్నారన్నారు. అయోధ్య రామ మందిర విషయంలో కూడా కొందరు ఇదే సందిగ్ధంలో వుండేవారని కానీ, తాము మాత్రం పూర్తి నమ్మకంతో ముందుకు సాగామని గుర్తు చేశారు.సరిగ్గా ఆ నమ్మకం నేడు వాస్తవ రూపును సంతరించుకుందని పేర్కొన్నారు.
అసలు ప్రపంచం భారత దేశాన్ని అనుసరించకపోతే ఏమవుతుంది? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయని, దాని భవిష్యత్తు ఎమవుతుంది? అన్న సందేహాలకూ తావు లేదని, ప్రతి భారతీయుడూ భారత్ ని ఆదరిస్తే, గౌరవిస్తే భారత దేశ వైభవం నిస్సందేహంగా పునరుద్ధరించబడుతుందని, భారత్ మహాశక్తిగా అవతరిస్తుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రముఖులందరూ భారత దుర్గామాత భావనను సర్ సంఘచాలక్ కి ఆపాదించారు. దీంతో వెంటనే మోహన్ భాగవత్ ప్రతిస్పందించారు. అయితే ఈ భావన వాస్తవానికి దివంగత మోరోపంత్ పింగళేకి చెందిందని స్పష్టం చేశారు.ఏకాత్మతా యాత్ర సమయంలో, భారత దుర్గా మాత విగ్రహాలను నాలుగు వేర్వేరు దిశలకు తీసుకువెళ్లారు; ఈ విగ్రహాలలో ఒకటి నాగపూర్‌కు చేరుకుంది. తదనంతరం, శ్రీరామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు, ఆయన సంకల్పం ఎట్టకేలకు సాకారమవుతోంది.
స్వామి అవధేశానంద గిరిజీ మాట్లాడుతూ భారత్ కేవలం ఒక భూభాగం మాత్రమే కాదని, జగదంబ స్వరూపమని అన్నారు.దాని నుంచి ఉద్భవించే ఆలోచనలు దైవిక స్వభావంగా వుంటాయని, ఈ ఆలయం ద్వారా దేశం అఖండ భారత్ వైపు పురోగమిస్తుంది అనడానికి మాకు కొన్ని సూచనలు అందుతున్నాయని అన్నారు.భారత్ కోల్పోయిన భూభాగాలు తిరిగి పొందుతాయని అన్నారు.
ఇక.. సాధ్వీ రితింభర మాట్లాడుతూ శక్తి ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనమై వుంటుందన్నారు. దానిని మేల్కొల్పడం అత్యవసరమని అన్నారు. అసలు ఆ శక్తి కచ్చితంగా ఎక్కడికి వెళ్లిందో ఆత్మ పరిశీలన అందరూ చేసుకోవాలని సూచించారు. భాషా, ప్రాంతీయ, రాజకీయాల కారణంగా హిందువుల సమష్టి శక్తి విచ్ఛిన్నమైపోయిందని, మనం ఒక్కటిగా వుంటే ఈ ప్రపంచాన్ని మార్చేయగలమని అన్నారు.



