News

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు: టీటీడీ కీలక నిర్ణయం

49views

విజయవాడ విమానాశ్రయ కేంద్రంగా తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్ల విక్రయాల జారీకి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 1500 శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్లను జారీ చేస్తోంది. ఇందులో ఆన్‌లైన్ ద్వారా 500 టికెట్లు, ఆఫ్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా 800 టికెట్లు, తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లను భక్తులకు అందిస్తోంది.

టీటీడీ కీలక నిర్ణయం: రేణిగుంట విమానాశ్రయంలో రోజూ ఉదయం జారీ చేసే 200 టికెట్లను హైదరాబాద్ నుంచి మొదటి విమానంలో వచ్చే భక్తులు కొద్ది నిమిషాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో తర్వాత విమానాల్లో వచ్చే వందలాది మంది భక్తులు శ్రీవాణి దర్శన టికెట్లు దొరక్క తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది.

శ్రీవారి దర్శనం మరింత సులభతరం: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రోజుకు 100 శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. దీనివల్ల అమరావతి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తిరుపతి వచ్చే భక్తులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆమోదం పొందిన వెంటనే విజయవాడలో శ్రీవాణి టికెట్ల కౌంటర్ ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం కానుంది.

ఇదిలా ఉండగా మరోవైపు శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల అభివృద్ధికి టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు దిశానిర్ధేశం చేసిన సంగతి తెలిసిందే.

నియోజకవర్గంలో 25-30 ఆలయాల నిర్మాణం : సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామన్న సీఎం, ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.