ArticlesNews

హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు

33views

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు.

సర్వప్రాణులూ అన్నంతో పోషణ పొందుతాయి. వర్షం వల్ల అన్నం ఉత్పత్తి అవుతుంది. వర్షాలు మేఘాల వల్ల, మేఘాలు యజ్ఞాల మూలంగా ఏర్పడతాయి. చేసే ప్రతీ కర్మను యజ్ఞంగా భావించాలని మన ధర్మగ్రంథాలు ప్రబోధించాయి. కర్మకు, యజ్ఞానికున్న అవినాభావ సంబంధాన్ని గీతలో కృష్ణుడు గుర్తుచేశాడు. అన్ని యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్ఠమైందన్నాడు. భీష్మాచార్యులు విష్ణుసహస్రనామాల్లో పరమాత్మను యజ్ఞస్వరూపుడిగా కీర్తిస్తే.. విశ్వమంతా యజ్ఞమయమని తైత్తిరీయోపనిషత్తు పేర్కొంది. ‘హృదయాన్ని ధునిగా భావించి ఆలోచనలను సమిధలుగా సమర్పించి.. వివేకాన్ని, విచక్షణని అగ్నిగా రగిలించగలిగితే జ్ఞానమనే విభూతి లభిస్తుంది’ అన్నారు శిరిడీ సాయిబాబా.

తల్లిదండ్రులను సేవించినా..
దేవతల తర్వాత తల్లిదండ్రులదే పూజ్యస్థానం. వారి రుణాన్ని తీర్చుకునే ప్రక్రియే పితృయజ్ఞం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారపురుషులు కూడా ఈ యజ్ఞాన్ని నిష్ఠగా ఆచరించారు. బతికుండగా తల్లిదండ్రులకు సేవ చేయాలి. మరణానంతరం పితృకార్యాలు, శ్రాద్ధకర్మల రూపంలో వంశ పరంపరను పూజ్యభావంతో తలచుకోవాలి. రాబోయే తరాలకు ఆ ఘనవారసత్వాన్ని అందించాలి. వారి పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహించాలి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులూ లభిస్తాయన్నది పురాణోక్తి. పితృయజ్ఞ ఆచరణ కుటుంబ వ్యవస్థ పరిపుష్టమవటానికి ఆధారం.

రుషి రుణం తీర్చుకుంటేనే..
మనజీవనానికి ఉన్నతమైన లక్ష్యాల్ని నిర్దేశించి, మేథో వికాసానికి దారి చూపారు మహర్షులు. ఆధ్యాత్మిక జ్ఞానానికీ, లౌకిక పరిజ్ఞానానికీ కూడా వారే కారకులు. ఒక్కమాటలో చెప్పాలంటే ధార్మిక శాస్త్రవేత్తలు. జ్ఞానభిక్ష పెట్టిన ఆ మహానుభావులను జ్ఞాపకం చేసుకుని వారికి కృతజ్ఞతలు చెల్లించుకునేదే రుషియజ్ఞం. దీన్ని బ్రహ్మయజ్ఞం, జ్ఞానయజ్ఞం అని కూడా అంటారు. వేద అధ్యయనం, రుషివాక్కులను ఆచరించడమే ఆ యాగ నిర్వహణ. ఆధ్యాత్మిక జ్ఞానం అజ్ఞానం నుంచే కాదు సంసార బంధాల నుంచి కూడా విముక్తులను చేస్తుంది. అందుకే ‘జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనం..’ అన్నాడు అన్నమయ్య.

ప్రకృతిశక్తుల ఆరాధన
ప్రకృతిని ఎన్నో శక్తులు పాలిస్తున్నాయి. ఒక్కో శక్తిని ఒక్కొక్క దేవతగా అభివర్ణించారు మహర్షులు. గాలి వీచడం, సూర్యుడు తాపాన్ని ప్రసరించడం, మేఘం కురవటం- అన్నీ దైవ శక్తులే. ఆ దేవతలను ప్రార్థించటం మూలంగా ప్రాపంచిక జీవనానికి అవసరమైనవన్నీ సమకూరుతాయని, ఆ ఆరాధనా విధానాలే యాగాలన్నారు. మన పూర్వీకులు ఇహలోక సౌఖ్యాలూ, పరలోక భాగ్యాలకూ కూడా యజ్ఞాన్ని సాధనంగా చేసుకున్నారు. హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసి, అనుకున్న దేవతామూర్తికి పదార్థాలను సమర్పించి, ఉపాసించినప్పుడు ఆ యాగం ఫలిస్తుంది. సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. రాజ్యం కోసం ధర్మరాజు రాజసూయాది యాగాలు చేశాడు. ఈ దైవ యజ్ఞాలతో పాటు పితృయజ్ఞం, రుషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం అని మరికొన్ని యాగాల్ని కూడా వేదాలు నిర్దేశించాయి.

దేవతలకు కృతజ్ఞతగా..
దేవతలకు కృతజ్ఞతలు చెల్లించటమే దేవ యజ్ఞం. పూజలు, వ్రతాలు, ఆరాధనలు ఇందులో భాగమే. సంప్రదాయాలు మారుతున్న దృష్ట్యా ప్రస్తుతకాలంలో యజ్ఞాలు ఆచరించటం కష్టమని, అందుకు బదులుగా ఆలయాల్లో పూజలు నిర్వహించవచ్చునని పెద్దలు చెబుతారు. ‘యజ్ఞోవైవిష్ణుః విష్ణుర్యజ్ఞాః’ అన్నారు కనుక.. యజ్ఞమంటే విష్ణువు, విష్ణువే యజ్ఞమని భావించాలి. ఆలయంలో విష్ణువును యజ్ఞానికి ప్రతిరూపాలైన కార్యకలాపాల ద్వారా సేవించమన్నారు. అది కూడా యజ్ఞంతో సమానమే! కఠోపనిషత్తులోని కథనాన్ని అనుసరించి.. వాజశ్రవనుడు అనే బ్రాహ్మణుడు నిష్ఠగా విశ్వజిత్‌ యాగం చేస్తున్నాడు. అతని పుత్రుడు పదకొండేళ్ల నచికేతుడు శ్రద్ధగా గమనిస్తున్నాడు. చివర్లో దానం చేస్తేనే యజ్ఞం పూర్తయినట్లు! వాజశ్రవనుడు తన ఆస్తి అయిన గోవుల్ని బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వసాగాడు. కానీ అవి ఎందుకూ ఉపయోగపడని బక్కచిక్కిన గోవులు. ఇలాంటి దానంతో యాగఫలం లభించకపోగా శిక్ష పడుతుందని నచికేతుడు గుర్తించాడు. తండ్రిలో మార్పు తేవాలని ‘నన్ను ఎవరికి దానమిస్తావు?’ అని పదేపదే అడిగాడు. అసహనం చెందిన తండ్రి ‘యమునికి దానమిస్తాను’ అన్నాడు. ఆ మాట ప్రకారం యముడి వద్దకు వెళ్లి, ఆయనతో సంవాదించి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను లోకానికి చాటాడు. వాజశ్రవనుడి యజ్ఞం మూలంగా లోకానికి పారమార్థిక భిక్ష లభించింది.

మానవసేవను మరవకుండా..
తనకూ, లోకానికీ కూడా మేలు కలిగించే సత్కార్యాలే మనుష్య యజ్ఞం. తనను తాను ఉద్ధరించుకోవటం, సాటిమనిషికి సాయపడటం, అతిథులను ఆదరించటం, సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించడం- ఈ యజ్ఞ విధులు. మన ఉన్నతికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. అలాంటి యజ్ఞమయ జీవితాన్ని గడపాలనే సంకల్పానికి ప్రతీకే యజ్ఞోపవీతం. జీవితాన్ని యజ్ఞ సమానమైన వ్రతంగా పాటించే వ్యక్తులు, వ్రతసూత్రంగా యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇతరులు చేసే మంచిపనుల్లో తోడ్పాటు, కర్తవ్యనిష్ఠ కూడా ఈ యాగం కిందికే వస్తాయి.

జీవులపై కారుణ్యం
మూగజీవాలపై ప్రేమ చూపటం భూతయజ్ఞం. అవతారమూర్తులు అడుగడుగునా ఈ యాగాన్ని ఆచరించి చూపారు. శ్రీరాముడు జటాయువు, ఉడుత వంటి ప్రాణులపై, శ్రీకృష్ణుడు గోవులపై చూపిన వాత్సల్యమే భూతయజ్ఞానికి నిదర్శనం. జైమిని మహర్షి ‘న్యాయమాల’ గ్రంథంలో ఏరువాక పున్నమని యజ్ఞంగా నిర్వచించాడు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతలను కాపాడటం యజ్ఞంగానే భావించమని వేదం చెబుతోంది. ఆ క్రమంలో దుక్కి దున్నటాన్ని మునులు ‘హలకర్మ’ అని నిర్వచించారు. రుషులు యజ్ఞయాగాదులు ఎంత శ్రద్ధతో చేసేవారో రైతులు వ్యవసాయాన్ని అలా చేసేవారు. విష్ణుపురాణం ఏరువాకని సీతాయజ్ఞంగా పేర్కొంది. సీత పదానికి నాగలి అనే అర్థమూ ఉంది. పూర్వం పుడమిని మంత్రాలతో స్తుతించి, నాగలితో దున్ని విత్తనాల్ని చల్లేవారు.

గీతాసారం, వేదజ్ఞానం, మన ధర్మగ్రంథాల ప్రబోధం పంచయజ్ఞ సిద్ధాంతం. అహింసకు, సామాజిక బాధ్యతకు నిలువెత్తు దర్పణమిది. ఇది మతపరమైన విశ్వాసం కాదు, విశ్వజనీన భావన. అందుకే లలితపరాశక్తిని ‘పంచయజ్ఞప్రియా’ అని స్తుతిస్తారు. ఈ పంచ యజ్ఞాలను నిర్వహించేవారినే పరమాత్మ అనుగ్రహిస్తాడన్నది వేదవాక్కు.