News

ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి తీసుకొస్తాం : VHP సంకల్పం

17views
ఆది శంకరుల జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత వెయ్యి సంవత్సరాలుగా వివిధ కారణాలతో హిందూ మతం నుంచి దూరమైన వారందర్నీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని సంకల్పించింది.ఇప్పటికే ఘర్ వాపసీ కార్యక్రమం నడుస్తోంది. దీనిని సాధు సంతుల సహాయంతో మరింత వేగంగా చేయాలని కూడా నిర్ణయించింది. ఆదిశంకరుల జయంతిని పురస్కరించుకొని కేరళంలోని కాలడీలో విశ్వహిందూ పరిషత్ ఆది శంకరుల జయంతి ఉత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాధు సంతులతో పాటు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అలోక్ కుమార్ ఇస్లామిక్ ఉగ్రవాదం, లవ్ జిహాద్ పై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో, కొందరు వ్యక్తులు తీవ్రవాద భావజాలాన్ని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మానవాళికి తీవ్రమైన ముప్పు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వసంకరమైన భావజాలాల నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి, అలాగే తిరిగి వారిని తమ మూలాల వైపు తీసుకురావడానికి తాము కట్టుబడి వున్నామని ప్రకటించారు.
‘‘మేము శంకరాచార్యుల వారి సంప్రదాయాన్ని అనుసరిస్తాం. అత్యంత నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని సైతం తన గురువుగా స్వీకరించిన మహోన్నత సంప్రదాయం అది. నేటి హిందూ సమాజంలో ఇంకా కుల వివక్ష అనే దురాచారం వుంది. దీనిని సమూలంగా నిర్మూలించడానికి మేము దృఢ సంకల్పంతో వున్నాం’’ అని అలోక్ కుమార్ ప్రకటించారు.