
మట్టితో పాటు జల వనరుల పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పుట్టపర్తిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవంకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులకు నీటి కాలుష్యం, మృత్తిక కాలుష్యం, గాలి కాలుష్యం వంటి వాటిపై అవగాహన కల్పించారు. రసాయనం లేకుండా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జల హారతి క్యాంపెయిన్ ఎంతో ముఖ్యమైనదని, ప్రజలు నదులు, చెరువులు, సముద్రాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెట్లను ప్రతి ఒక్కరూ నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. సోలార్ వినియోగం వల్ల ఇంధన ఖర్చు తగ్గి కాలుష్యం కూడా చాలావరకు తగ్గుముఖం పడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించి సబ్సిడీపై సోలార్ అందిస్తున్నారని దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.





