ArticlesNews

ఒక త్యాగం, ఒక సహనం, ఒక ధైర్యం సీతాదేవి

7views

( ఏప్రిల్‌ 25 –  సీతా జయంతి  )

రామాయణ మహాకావ్యంలో సీతమ్మ పాత్ర చిత్రణ అమోఘం, అద్భుతం. ఆదర్శ గృహిణిగా, సహనానికి ప్రతీకగా నిలిచిన ఆ సాధ్వీమణి వ్యక్తిత్వం ఎంతో అపురూపమైంది. అనురాగం, ఆత్మీయత, వినయం, నమ్రత, ధైర్యం, స్థైర్యం, సహనం, ఆత్మవిశ్వాసం.. ఆమెకి వన్నె తెచ్చాయి. సీతమ్మ అందాల రాశే కాదు, సుగుణాల పోగు.

భర్త అడుగుజాడల్లో నడిచిన సహధర్మచారిణి సీతమ్మ. రాముడు వనవాసానికి వెళ్తుంటే రాజభోగాలను తృణప్రాయంగా భావించింది. పతి తోడుంటే ముళ్లబాట కూడా అయోధ్యతో సమానమనుకుంది. ఆ భావన భర్తపట్ల ఆమె అచంచల అనురాగానికి నిదర్శనం. పతి తోటిదే లోకమని అంతఃపురాన్ని వదిలి అడవి బాట పట్టిన త్యాగం సీతను మహోన్నత శక్తిగా నిలబెట్టింది.

భూదేవి పుత్రిక అయిన సీతమ్మకు తన తల్లికి ఉన్నంత సహనం ఉంది. రావణుడు అపహరించి అశోకవనంలో బంధించినప్పుడు.. చుట్టూ రాక్షస స్త్రీల భీకర గర్జనలు వినిపిస్తున్నా ఆమె లేశమాత్రం ధైర్యం కోల్పోలేదు. హనుమంతుడు వచ్చి రాముడి అంగుళీయకం ఇచ్చినప్పుడు, ఆమె తన వేదనను పంచుకుంది. తానింకా ప్రాణాలతో ఉన్నానని రాముడికి తెలియజేయమనడం ఎదురుచూపులోని తీవ్రతను చాటుతుంది.

తనను తానే రక్షించుకోగల శక్తి ఉన్నప్పటికీ సీతమ్మ శ్రీరాముడు వచ్చేవరకూ వేచిచూసింది. యుద్ధం ముగిశాక తనను వేధించిన రాక్షస స్త్రీలను సైతం ‘లోకంలో తప్పు చేయనివాళ్లెవరు?’ అనుకుని.. క్షమించడం ఆమె విశాల హృదయాన్ని, శత్రువులను కూడా ప్రేమించగల ఉన్నత సంస్కారాన్ని లోకానికి చాటిచెప్పింది.

సీతమ్మవారిలో పవిత్రత, ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైనవి. అగ్నిప్రవేశం చేయడం ఆమె స్థిరచిత్తానికి, అచంచల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ‘నా హృదయం నిరంతరం రాముణ్ణే ధ్యానిస్తుంటే, అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక’ అనడంలో సీతమ్మ ధైర్యం సామాన్యమైనది కాదు. లోకోపవాదు కారణంగా.. గర్భవతి అని కూడా చూడకుండా రాముడు అడవికి పంపినప్పటికీ భర్తను ద్వేషించలేదామె. వాల్మీకి ఆశ్రమంలో ఒంటరి పోరాటం చేస్తూ, పుత్రులు కుశలవులను సకల విద్యల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దింది. తల్లిగా తన బాధ్యత ముగిసిందని భావించిన క్షణాన, భూమి నుంచి వచ్చిన సీతమ్మ తిరిగి భూమాత ఒడిలోకి చేరుకుంది. అలా ఆమె తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది.

సీతమ్మ అంటే ఒక త్యాగం, ఒక సహనం, ఒక ధైర్యం. ఎన్ని కష్టాలు, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధర్మాన్ని వీడకూడదని ఆమె జీవితం మనకు నేర్పుతుంది. అందుకే యుగాలు గడిచినా మన హృదయాల్లో ఆరాధ్య దేవతగా, ఆదర్శమూర్తిగా నిలిచిపోయింది.