ArticlesNews

వరాల అప్పన్నకు సిరిచందన వందనాలు

9views

(  సింహాచల క్షేత్ర చందనోత్సవం )

ఒక్క మొక్కుతో అనుగ్రహించే చల్లని దేవర వరాహలక్ష్మీనరసింహస్వామి. ఈ స్వామిని కోరిన వరాలిచ్చే ప్రత్యక్ష దైవంగా, ఇంటిపెద్దగా, తమ నోములు ఫలించి పుట్టిన బిడ్డగా గుండెల్లో గుడికట్టుకుని ఆరాధిస్తారు భక్తులు. అప్ప అంటే తండ్రి, సోదరుడు, అప్పడు అంటే- కంటిపాప, ఇంటికి ఆనందరూపమైన కన్నబిడ్డ. ఇన్నివిధాల ఆ స్వామిని తమ సర్వస్వంగా భావిస్తారు. ఆ అపురూప భక్తి చందన సుగంధాలు సింహాచల క్షేత్రంలో నిత్యం పరిమళిస్తుంటాయి. వైశాఖ శుద్ధ తృతీయ నాటి చందనోత్సవంలో ఈ భావన మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

విశాఖపట్నంలోని సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీనరసింహ స్వామికి వైశాఖ శుద్ధ తృతీయనాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇది మహా వేడుక. లక్షలాదిమంది భక్తుల విశ్వాసం. ఏడాది పొడవునా నాలుగంగుళాల మందం గల చందన లేపనం ఆచ్ఛాదనలో ఉండే స్వామి లింగాకృతిలా కనిపిస్తాడు. ఈ ఉత్సవం నాడు మాత్రమే చందన కవచాన్ని తొలగించి, స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు ఆలయ నిర్వాహకులు. నిజరూపంలో ఉన్న స్వామికి పన్నీరు, గంధం ఇతర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అనువంశిక ధర్మకర్తలు తొలి దర్శనం చేసుకుని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

చందన కవచాన్ని తొలగించి..

చందనోత్సవం రోజున తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. సుప్రభాత సేవ అనంతరం అర్చకులు స్వామివారి మీద ఉన్న పాత చందనాన్ని ప్రత్యేక పనిముట్లతో జాగ్రత్తగా తొలగిస్తారు. దీన్నే చందనం వలుపు అంటారు. కవచం తొలగించిన తర్వాత స్వామి వరాహ ముఖం, నరసింహ శరీరం, సింహపుతోకతో కూడిన అత్యంత శక్తిమంతమైన రూపంలో దర్శనమిస్తాడు. ఆ దివ్యమూర్తిని చూసిన భక్తులు పులకించిపోతుంటారు. నిజరూప దర్శనం ముగిసిన తర్వాత, అదేరోజు రాత్రి స్వామివారికి తిరిగి చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మిగిలిన విడతల చందనాన్ని సమర్పిస్తారు. మొత్తంగా ఏడాదికి సుమారు 120 కిలోల మంచిగంధాన్ని స్వామివారికి అద్దుతారు.

సింహాద్రి అప్పన్న దర్శనం కోసం తెలుగువారితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఉత్సవం రోజున స్వామి నిజ రూపాన్ని ఒక్క క్షణం చూసినా జన్మ ధన్యమవుతుందని, స్వామి విగ్రహంపై నుంచి తీసి ఇచ్చే ఘటచందన ప్రసాదాన్ని ధరిస్తే.. అనారోగ్యాలు తొలగి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు.

హిరణ్యకశిపుడి సంహారం తర్వాత స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. ఆ ఉగ్రజ్వాలలను శాంతింపజేయడానికి దేవతలు, మునులు చందనాన్ని లేపనంగా అద్దారు. నాటి నుంచి స్వామి ఏడాది పొడవునా చందన లేపనంతో ఉంటూ వైశాఖ శుద్ధ తృతీయ నాడు మాత్రమే నిజరూప దర్శనమివ్వటం ప్రారంభమైందన్నది పౌరాణిక కథనం.

 ప్రహ్లాదుడు ప్రార్థించాడు..స్వామి కరుణించాడు

సింహాచలంలో అవతార సమైక్య రూపంగా స్వామి దర్శనమివ్వటానికి కారణముంది. హిరణ్యకశిపుని ఆజ్ఞననుసరించి ప్రహ్లాదుణ్ణి భటులు కొండ మీదినుంచి సముద్రంలోకి విసిరేశారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై రక్షించగా.. అతడు- ‘స్వామీ! హిరణ్యాక్షుని అంతమొందించిన వరాహ అవతారం, త్వరలో హిరణ్యకశిపుని సంహరించబోయే నరసింహ అవతారం- కలిసిన సమైక్య రూపాన్ని ధరించి దర్శనమివ్వు’ అని ప్రార్థించాడు. ఆ కోరిక మేరకు విష్ణువు వరాహ నరసింహ రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుడి మరణానంతరం ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామికి ఆలయం నిర్మించి, పూజలు చేశాడు. అదే సింహాచల ఆలయం.

 పురూరవ చక్రవర్తికి దక్కిన అదృష్టం

స్థలపురాణాన్ని అనుసరించి.. ప్రహ్లాదుడు ప్రతిష్ఠించిన విగ్రహం కాలక్రమంలో భూమి లోకి చేరింది. ఒకరోజు పురూరవ చక్రవర్తి పుష్పకవిమానంలో ఆకాశమార్గాన వెళ్తుండగా సింహాచలకొండపై దివ్యకాంతిని గమనించాడు. ఆయన అన్వేషించగా.. భూమిలో నరసింహ స్వామి విగ్రహం లభించింది. ఇంతలో ‘ఈ స్వామి ఉగ్రరూపం భరించశక్యం కాదు. ఈ విగ్రహాన్ని సదా చందన లేపనంతో కప్పి ఉంచాలి. సంవత్సరానికి ఒక్కరోజే చందనం లేకుండా నిజరూప దర్శనం చేసుకోవాలి’ అని ఆకాశవాణి వినిపించింది. ఆ ఆదేశానుసారం పురూరవుడు ఆలయం నిర్మించి.. వైశాఖ శుద్ధ తృతీయనాడు స్వామివారికి చందన లేపనం సమర్పించాడు. నాటి నుంచి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. అలా చందన సేవను ప్రారంభించిన ఘనత పురూరవ చక్రవర్తికి దక్కింది.

 ఆ అదృష్టమంతా వారిదే

చందనాన్ని సిద్ధంచేసే ప్రక్రియ ఉత్సవానికి పక్షం ముందుగానే ఆరంభమవుతుంది. స్వామివారికి సమర్పించే గంధపు చెక్కలను తమిళనాడు తిరువత్తూరు తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తారు. గంధపు చెక్కలను పరిశుభ్రమైన రాతిమీద నీళ్లు జోడిస్తూ అరగదీస్తారు. ఈ పుణ్యకార్యంలో ఆలయానికి సంబంధించిన వారు మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. చందనంలో పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను కలుపుతారు.

చందనోత్సవం శాంతికి ప్రతీక

ఉగ్రరూపంలో ఉన్న దైవాన్ని చందనం ఎలా శాంతింపజేస్తుందో, అలాగే మనిషి తనలోని క్రోధాన్ని, అహంకారాన్ని భక్తి, ధ్యానం అనే చందనంతో శాంతింపజేసుకోవాలని, అప్పుడే విశ్వశాంతి వర్ధిల్లుతుందని ఈ ఉత్సవం బోధిస్తుంది. అంతేకాదు పైకి కనిపించేది మాయ అని, ఆ మాయను తొలగించి ఆత్మజ్ఞానంతో పరమాత్మను దర్శించాలనే సందేశాన్ని అందిస్తుంది.

 ప్రొఫెసర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు