News

‘డాక్టర్‌ టెర్రర్‌’ కేసులో సంచలన విషయాలు

6views

గతేడాది దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకొన్న ఆత్మాహుతి దాడితో బయటపడిన ‘డాక్టర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ ’ తీవ్ర కలకలం రేపింది. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌పై దర్యాప్తు జరిపిన జమ్మూకశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. కేసుకు సంబంధించి తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న నిందితులు తమ ఇళ్లనే పేలుడు పదార్థాల తయారీ హబ్‌గా మార్చినట్లు తెలిసింది.

శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా స్టేట్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇందులో 10 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో ఎర్రకోట దాడిలో  మరణించిన డాక్టర్‌ ఉమర్‌ నబీతో పాటు మరో నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వీరు ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై వక్రమార్గం పట్టినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

‘టీఏటీపీ’.. కొత్త టెర్రర్‌ వ్యూహం..

ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నవారు ట్రైఅసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌ (టీఏటీపీ)ని వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇది అత్యంత అస్థిరమైన, ప్రమాదకరమైన పేలుడు పదార్థం. సాధారణ మిలిటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థాలతో పోలిస్తే దీని తయారీ సులువుగా ఉంటుందట. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని రసాయనాలతో దీన్ని తయారుచేసే అవకాశం ఉండటంతో ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న ఉగ్ర దాడుల్లో టీఏటీపీని విరివిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దాన్ని దేశంలో, అది కూడా రద్దీగా ఉండే ప్రదేశాల్లో తయారుచేయడంపై దర్యాప్తు ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

ఇళ్లు, ల్యాబ్‌ల్లోనే..

వృత్తి నైపుణ్యాలున్న ఇలాంటి నిందితులు తమ నివాస స్థలాలు, లాబొరేటరీలనే హబ్‌లుగా మార్చుకుని పేలుడు పరికరాలను తయారుచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  ఇలాంటి పేలుడు పదార్థాలను గుర్తించడం కూడా కష్టమైన పనిగా మారుతోందని దర్యాప్తు ఏజెన్సీ తెలిపింది. పైగా ఇవి చాలా ప్రమాదకరమైనవి. దాడి సమయంలోనే గాక.. తయారీ క్రమంలోనే పేలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఏజెన్సీ పేర్కొంది. గతంలో కశ్మీర్‌ (Jammu and Kashmir)లోని ఉగ్ర నెట్‌వర్క్‌లు పేలుడు పదార్థాల స్మగ్లింగ్‌పై ఎక్కువగా ఆధారపడేవి. కానీ, ఇప్పుడు వీరి వ్యూహాలు మారుతున్నాయని, సీమాంతర సరఫరాపై ఆధారపడకుండా స్వతంత్రంగా పేలుడు పదార్థాలను తయారుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఏజెన్సీ తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది.