
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74 కిలోమీటర్ల మేర వంతెనపై వెళ్లే హైవే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు గాను రూ. 18,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో వాహన రాకపోకలు వేగంగా సాగుతాయని భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు రావాలంటే ఏపీ మొత్తానికీ దోర్నాల మార్గం ఒక్కటే ఉంది.అంతేకాకుండా ఏపీవ్యాప్తంగా ఎటువైపు నుంచి అయినా వాహనాలు దోర్నాలకు వచ్చి తీరాల్సిందే. అంతేకాకుండా తెలంగాణ నుంచి వచ్చేవారు కల్వకుర్తి, మన్ననూరు మీదుగా అటవీ ప్రాంతంలో ప్రయాణించాలి. దాంతోపాటు జాతీయ రహదారి-765 మీదుగానే ఈ రాకపోకలను సాగిస్తుండటం గమనార్హం. శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తుండటంతో వాహన రద్దీ సైతం ఎక్కువైంది. దీనికి అనుగుణంగా హైవేను 4 వరుసలుగా విస్తరించేందుకు భారీ ఎత్తున అటవీ భూములు అవసరం. కానీ అది సాధ్యం కావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి మరల్చింది. కీలకమైనటువంటి అటవీ ప్రాంతంలో 86.74 కిలోమీటర్ల మేర వంతెనపై వెళ్లే హైవే-ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని అధికారులంతా నిర్ణయించారు. దీని ద్వారా వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదని, వాహన రాకపోకలు సైతం వేగంగా సాగుతాయని వారంతా భావిస్తున్నారు.
ప్రాజెక్ట్‌కు రూ. 18,500 కోట్ల ఖర్చు! శ్రీశైలం వైపు పయనమయ్యే ఘాట్‌లో నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాలు వరసగా ఉన్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు, ఏపీలోని 41.39 కిలోమీటర్లతో కలిపి మొత్తంగా 86.74 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇది నాలుగు వరుసలతో ఉండనుండటం గమనార్హం. అదే రీతిలో కృష్ణా నదిపై ప్రస్తుతం ఉన్న వంతెనకు, డ్యామ్‌కు మధ్యలో 450 మీటర్ల పొడవునా కొత్తగా ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. శ్రీశైలం క్రాస్ రోడ్ వద్ద నుంచి సరాసరి ఆలయం వరకు 4.33 కిలోమీటర్ల అనుసంధాన రోడ్డును నిర్మించనున్నారు. మొత్తంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు రూ. 18,500 కోట్ల ఖర్చవుతుందని అధికారుల ప్రాథమిక అంచనా. ఇందులో ఏపీ పరిధిలో రూ. 10,500 కోట్లు, తెలంగాణలో భాగానికి రూ 8,000 కోట్లుగా అంచనాలున్నాయి.





