News

తప్పుడు AI కంటెంట్ తో ‘‘సంఘ్’’ పై కుట్రలు..

91views

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై బురద జల్లడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు. సంఘ్ పై తప్పుడు కథనాలను అల్లుతున్నారు. అనేక కల్పిత కథనాలను సంఘ్ తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే AI తో తప్పుడు కథనాలను అల్లుతూ, కుట్రలు చేస్తున్నారు. అంతేకాకుండా సంఘ్ కి సంబంధించిన లెటర్ హెడ్ ను, అధికారిక చిహ్నామైన భగవాధ్వజాన్ని కూడా ఇందులో పేర్కొంటూ దుర్వినియోగం చేస్తున్నారు.

దీనిపై సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓటర్లను తప్పుదోవ పట్టించి, కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చడమే దీని వెనుక వున్న అసలు లక్ష్యమని నొక్కి చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ ప్రచారంలో వున్న నకిలీ వార్తలు, కంటెంట్ ను విడుదల చేసింది.

ఎందుకంటే తప్పుడు కథనాల ఉచ్చులో ఎవ్వరూ చిక్కుకోడదని, నిత్యం అప్రమత్తతతో వుండాలని, సరైన నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే తాము ఈ నకిలీ కంటెంట్ ను ప్రజల దృష్టికి తెస్తున్నట్లు ఆరెస్సెస్ నేతలు కొందరు పేర్కొంటున్నారు.ఈ తప్పుడు సమాచార ప్రచారంలో అత్యంత ఆందోళనకరమైన అంశం డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడమేనని సంఘ్ చెబుతోంది. దీనిద్వారా సర సంఘచాలక్ మోహన్ భాగవత్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు చేసిన ప్రకటనలను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తున్నారు.

దీనికి కొన్ని ఉదాహరణలను సంఘ్ చూపుతోంది. అందులో మొదటిది ఏమంటే… ఓ వీడియోలో మోహన్ భాగవత్ భారత సైన్యం కాషాయీకరణ గురించి మాట్లాడుతున్నట్లు చిత్రీకరించారు. నిజానికి సర సంఘచాలక్ ఐక్యత గురించి వుంది. PIB, FACT CHECKERS దీనిని పూర్తిగా నకిలీ అని ప్రకటించాయి. అలాగే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన మాట్లాడిన ఓ పాత వీడియోను AI ని ఉపయోగించి మార్చేశారు. సంఘ్ ను ఆయన తాలిబాన్ తో పోలుస్తున్నట్లు చేసేశారు. ఆ తర్వాత ఇది పూర్తిగా నిరాధారమని తేలిపోయింది.

అయితే కేవలం నకిలీ వీడియోలే కాకుండా, లేఖలు, నకిలీ పత్రాలను కూడా సృష్టిస్తున్నారు. ఇటీవలే ఓ లేఖ వైరల్ అయినట్లు సంఘ్ పేర్కొంటోంది. అందులో సర సంఘచాలక్ మోహన్ భాగవత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసినట్లు వుంది. అంతేకాకుండా హోంమంత్రి అమిత్ షా అసోం సీఎంను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారా? అంటూ ప్రధానిని ప్రశ్నించినట్లు అందులో వుంది. అయితే ఈ లేఖ పూర్తిగా నకిలీదని సంఘ్ ప్రకటించింది. రాజకీయంగా అస్థిరతను సృష్టించాలన్న ఉద్దేశంతోనే దీనిని సృష్టించినట్లు తెలిపింది.

దీంతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్యకు సంబంధించిన పాస్ పోర్ట్ వివాదంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ అసోం సీఎం హిమంత భార్య దగ్గర వివిధ దేశాలకు చెందిన పాస్ పోర్టులు వున్నాయంటూ ఆరోపణలకు దిగారు. దీనిని బీజేపీ ఖండించింది. దీనిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మోహన్ భాగవత్ ప్రధానికి లేఖ రాసినట్లు ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని మొదట కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తెచ్చింది.

ఇక..AI సాంకేతికతను ఉపయోగిస్తూ, సంఘ్ పేరును దుర్వినియోగం చేస్తున్నాయని, నకిలీ పోస్టులను సృష్టిస్తున్నారని, నకిలీ పోస్టులపై అసోం విభాగం ఇప్పటికే గౌహతి సైబర్ పోలీసులకు ఫిర్యాదులు చేసిందని ఆరెస్సెస్ ప్రకటించింది.‘‘ఆరెస్సెస్ పేరుతో ప్రచారం చేస్తున్న కంటెంట్ పూర్తిగా అబద్ధం. దురుద్దేశపూరితమైంది.ప్రజలను తప్పుదోవ పట్టించేలా వుంది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కూడుకున్నది’’ అంటూ ఆ ఫిర్యాదులో సంఘ్ పేర్కొంది. దీంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడే విధంగా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారని కూడా వీడియోలను సృష్టించారు. దీంతో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించిన రహస్య లేఖలంటూ తెరపైకి తెచ్చారని, అవి కూడా పూర్తిగా నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారని సంఘ్ తేల్చి చెప్పింది. అందులో సంఘ్ లెటర్ హెడ్ తో పాటు, సంఘ్ అధికారిక చిహ్నం భగవాధ్వజాన్ని కూడా వాడుతున్నారు. సంఘ్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ, అసోం పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ సంస్థల విద్యార్థి విభాగాలతో సంబంధాలున్న వారే ఇలా చేస్తున్నారని తెలుసుకొని, కొందర్ని అరెస్ట్ కూడా చేశారు.

తాజాగా ఆరెస్సెస్ పై, ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ను అపఖ్యాతి పాలుచేసే కుట్రలో భాగంగా ఇలాంటి ఫేక్ వార్తలను, కంటెంట్ ను తయారు చేసి, సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం NSUI నేతలైన మోహిత్ యాదవ్, అద్వేష్ చౌహాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక ఓ పాత్రికేయుడు కూడా వున్నాడని, ఆయన ఓ కాంగ్రెస్ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడని కూడా తేలినట్లు సమాచారం.

అయితే ఈ AI ప్రేరేపిత తప్పుడు కంటెంట్ కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాలేదు. సామాజిక, మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి కూడా వాడుతున్నారు. ఓ నిర్దిష్ట వర్గానికి చెందిన పిల్లలను సంతాన హీనులుగా మార్చడానికి టీకాలను వినియోగిస్తున్నారని కూడా నిరాధారమైన పుకార్లను సృష్టించారు.అలాగే ఒక ముస్లిం సైనికాధికారి కుటుంబంపై దాడులు జరిగాయంటూ వచ్చిన తప్పుడు వార్తలను సృష్టించారు.

అలాగే సంఘ్ రాజకీయ సర్వేలు ఎప్పుడూ చేయదు. నిర్వహించదు కూడా. ఎన్నికల ముందు ఆరెస్సెస్ సర్వేలు చేసిందంటూ నకిలీ లేఖలను వైరల్ చేస్తుంటారని, బిహార్, హర్యానా ఎన్నికల ముందు ఇలాంటి నకిలీ లేఖలు వైరల్ అయ్యాయని సంఘ్ గుర్తు చేసింది. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా వుండాలని కోరింది.

ఇంకా మరీ నీచమైన స్థితి ఏమిటంటే అసలు సోషల్ మీడియా అకౌంటే లేని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో కూడా తప్పుడు ఫేక్ వీడియోలు, కంటెంట్ లను సృష్టిస్తున్నారు. ప్రొఫైల్స్ ను కూడా సృష్టించారు.అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో గతంలో ఓ సంఘటన జరిగితే, అది యూపీలో జరిగిందని ప్రచారాలు చేశారు. దీంతో సంఘ స్వయంసేవకులు, మద్దతుదారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆరెస్సెస్ ఓ విస్పష్టమైన ప్రకటన చేసింది. సంఘ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేందుకు, ప్రజల మధ్య వున్న సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి నకిలీ లేఖలు, నకిలీ వీడియోలను ప్రచారంలోకి తెస్తున్నారని తేల్చి చెప్పింది.ఇలాంటి తప్పుడు ఫేక్ కంటెంట్ ను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలు, అధికారిక సమాచారల, ప్రసార మాధ్యమాల ద్వారా దానిని పోల్చుకోవడం అత్యావశ్యకమని ప్రజలను కోరింది.