
ఆమధ్య కేరళలో జరిగిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహం తాజాగా సిపీఎం నేతలను చిక్కుల్లోకి నెట్టేసింది. నిన్నటి వరకు ఇది ‘రియల్ కేరళ స్టోరీ’ అంటూ మురిసిపోయిన సీపీఎం నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మౌనం దాల్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను అక్కున చేర్చుకుని, ఘనంగా ఆశీర్వదించిన కేరళ నేతలు.. ఆ వధువు మైనర్ అని తెలియడంతో కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహ ఉదంతం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వివాహంపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో ‘కుంభమేళా మోనాలిసా’గా గుర్తింపు పొందిన యువతి.. ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి వధువు కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేరళలోని అధికార సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ జంటకు అండగా నిలిచారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ స్వయంగా ఈ వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘ఇది అసలైన కేరళ స్టోరీ. మానవత్వాన్ని చాటిచెప్పే భూమిగా కేరళ ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహించడం, ఆశీర్వదించడం సమాజ బాధ్యత అని కూడా ఆయన అన్నారు. మంత్రి వి శివన్ కుట్టి, ఎంపీ ఏ.ఏ. రహీమ్ తదితర ముఖ్య నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొని పూలమాలలతో కొత్త జంటను సత్కరించారు.





