
ఓబీసీ రిజర్వేషన్లను మతం పేరుతో దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
రాజ్యసభలో ‘జీరో అవర్’ సందర్భంగా బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. కొన్ని రాష్ట్రాల్లో మతం ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఓబీసీ కోటాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మతం ఆధారంగా ఇస్తున్న ఇటువంటి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష జరపాలని ఆయన కోరారు. లక్ష్మణ్ మాట్లాడుతున్న సమయంలోనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇండి కూటమికి చెందిన దాదాపు అన్ని పార్టీల సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అటు ప్రతిపక్షాల వాకౌట్‌పై సభాపక్ష నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వానికి గానీ, విపక్ష కూటమికి గానీ చర్చల పట్ల ఆసక్తి లేదని ఆయన విమర్శించారు. విపక్షాలకు రాజ్యాంగ విలువలన్నా, పార్లమెంట్ సంప్రదాయాలన్నా గౌరవం లేదని ధ్వజమెత్తారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గానే పరిగణిస్తూ ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని నడ్డా ఆరోపించారు.
“సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇప్పుడు మతం పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా వాళ్లను ఓబీసీ జాబితాలో చేర్చుతున్నారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలే వాటిని అనుభవిస్తున్నారు. మతం ప్రాతిపదికన కల్పిస్తున్న ఇటువంటి రిజర్వేషన్లపై సమగ్ర సమీక్ష జరపాలని నేను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మన విధానాలు కేవలం మతపరమైన గుర్తింపుపై కాకుండా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనంపైనే దృష్టి సారించాలి. అప్పుడే మనం సామాజిక న్యాయానికి సంబంధించి అసలైన స్ఫూర్తిని కాపాడగలం.”-కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
కర్ణాటక, తమిళనాడు, బంగాల్, కేరళ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వారిని ఓబీసీ కేటగిరీలో చేర్చాయని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో అవకాశం లేదని, ఈ విషయాన్ని బీఆర్ అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాష్ట్రాలు ఓబీసీలకు ఉద్దేశించిన ఈ రిజర్వేషన్లను మతపరమైన ప్రాతిపదికన, ముఖ్యంగా ముస్లింలకు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయన్నారు.
“కర్ణాటకలో మొత్తం ముస్లిం సమాజాన్ని ఒకే కులంగా పరిగణించి ఓబీసీ జాబితాలో చేర్చి ప్రత్యేకంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బంగాల్‌లో సుమారు 97 శాతం ముస్లింలను ఓబీసీలుగా చేర్చారు. దీనివల్ల ప్రధానంగా వెనుకబడిన వర్గాలకు వారి న్యాయమైన వాటా దక్కకుండా పోయింది. అటు తమిళనాడులో ఓబీసీ జాబితాలో దాదాపు 95 శాతం ముస్లిం జనాభాను కవర్ చేస్తున్నాయి. వెనుకబడిన తరగతి ముస్లింలకు 3.5 శాతం రిజర్వేషన్ ఉంది. కేరళలో ఓబీసీ జాబితాలో ముస్లింలను ఒక కులంగా చేర్చారు. వారి రిజర్వేషన్‌ను 3 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. తెలంగాణలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చడంతో పాటు ప్రత్యేకంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ విధంగా ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు కోసం దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌ను ముస్లింలు పొందుతున్నారు.” అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.





