ప్రస్తుత ఎల్‌పీజీ వంటగ్యాస్ సంక్షోభంలోనూ ఆ ఊరి ప్రజలంతా నో వర్రీ అంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినా, ధర పెరిగినా తమకు ఇబ్బందేం ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటి ? ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంట కోసం వాళ్లు వినియోగిస్తున్న ఇంధనం ఏది ? ఊరు ఊరంతా ఇంధన భద్రతను ఎలా సాధించగలిగింది ? ఈ కథనంలో తెలుసుకుందాం.
శివాజీ కగ్నీకర్ : దశాబ్దాల కిందే గొప్ప విజన్
శివాజీ కగ్నీకర్ (76) ప్రముఖ గాంధేయవాది. ఆయన కర్ణాటకలోని బెళగావి జిల్లా కట్టన్ భావి గ్రామస్థుడు. జన జాగ్రణ అనే సామాజిక సేవా సంస్థను 1990వ దశకం నుంచి నడుపుతున్నారు. ఆ సమయానికి బెళగావి జిల్లాలోని గ్రామాల్లో ప్రజలు వంట కోసం ఎక్కువగా కట్టెలపైనే ఆధారపడ్డారు. ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టెల కోసం పెద్దఎత్తున చెట్ల నరికివేత జరిగేది. దీనివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినేది. దీంతోపాటు కట్టెలను కాల్చినప్పుడు వెలువడే పొగను పీల్చి మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారినపడేవారు. ఇవన్నీ చూశాక, శివాజీ కగ్నీకర్ ప్రజా ఉద్యమానికి నడుం బిగించారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో పర్యటించి పశువుల పేడతో గ్యాస్‌ను తయారుచేసే బయోగ్యాస్ ప్లాంట్లను ఇంటి పెరట్లో నిర్మించుకోవాలని ప్రజలను చైతన్యపరిచారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అవగాహన కల్పించారు. ఆయన ప్రయత్నం ఫలించింది. 1990 నుంచి 1995 మధ్యకాలంలో బెళగావి, హుక్కేరి, ఖానాపూర్ తాలూకాల పరిధిలోని దాదాపు 30వేల ఇళ్లలో బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం జన జాగ్రణ, ఖాదీ గ్రామోద్యోగ్ వంటి సంస్థలు సహకారాన్ని అందించాయి.

బయోగ్యాస్‌ను ఉపయోగిస్తున్న కట్టన్ భావి గ్రామం
ఊరిలోని 85 శాతం ఇళ్లలో బయోగ్యాస్ ప్లాంట్లు
కట్టన్ భావి ప్రజలను అక్షరాస్యులుగా మార్చడానికి 1990వ దశకంలో రాత్రిబడిని నిర్వహించే వాడిని అని శివాజీ కగ్నీకర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. ‘ఆ సమయంలోనే మా ఊరివాళ్లకు బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు గురించి అవగాహన కల్పించాను. పశువులు ఉన్న కుటుంబాలు పెరట్లో బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించుకోవాలని సూచించాను. ఇంటి వంట అవసరాలకు సరిపడా గ్యాస్‌ను బయోగ్యాస్ ప్లాంటు నుంచి పొందొచ్చని వాళ్లకు చెప్పాను. దీనివల్ల మహిళలకు శ్వాసకోశ సమస్యలు రావడం తగ్గుతుందని తెలిపాను. నా మాటలు విని చాలామందిలో మార్పు వచ్చింది. మా ఊరిలో దాదాపు 250 కుటుంబాలు ఉండగా, 225 (85 శాతం) కుటుంబాలు పెరట్లో బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకున్నాయి. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సహాయ సహకారాలను, రాయితీలను అందించాయి. రాయితీపై కొన్న ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో ప్రజలే స్వయంగా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకున్నారు.గత 40 ఏళ్లుగా కట్టన్ భావి ప్రజలు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నందున, ఇప్పుడు ఎల్‌పీజీ సంక్షోభం ఏర్పడినా వాళ్లపై పెద్దగా ప్రభావం పడటం లేదు. మనదేశంలోని అన్ని గ్రామాలూ ఇలాగే చేస్తే, ఇంధన భద్రతను మనం సాధించొచ్చు’ అని శివాజీ వివరించారు.
పశువుల పేడ, మరుగుదొడ్డి వ్యర్థాలతో బయోగ్యాస్
కట్టన్ భావి గ్రామ ప్రజలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశుపోషణ. దాదాపు ఇక్కడి ప్రతీ ఇంట్లోనూ ఆవులు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఈ పశువుల పేడను, మరుగుదొడ్డి వ్యర్థాలతో కలిపి బయోగ్యాస్ ఛాంబర్‌లోకి పంపి, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఊరిలోని ప్రతీ ఇంటి పెరట్లోనూ మనకు బయోగ్యాస్ యూనిట్లు కనిపిస్తాయి. వాటి నుంచి వంటగదులకు గ్యాస్ సప్లై అవుతుంటుంది.
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తేనే ఇంధన భద్రత
‘రాయితీతో కూడిన ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ వల్ల కొన్ని ప్రాంతాలలో బయోగ్యాస్ వినియోగం తగ్గిపోయింది. విదేశాల నుంచి తెప్పించుకునే ఇంధన వినియోగాన్ని ఇంతగా ప్రోత్సహించకూడదు. ప్రజలు స్వయంగా బయోగ్యాస్‌ను తయారు చేసుకోవడానికి అధిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వాలు అందించాలి. పశువులున్న రైతులు బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఇందుకోసం రాయితీలను అందించాలి. దీనివల్ల మన దేశం ఇంధన భద్రతను సాధిస్తుంది’ అని శివాజీ కగ్నీకర్ తెలిపారు.
4 దశాబ్దాలుగా గోబర్ గ్యాస్‌నే వినియోగిస్తున్నాం
గత 4 దశాబ్దాలుగా బయో (గోబర్) గ్యాస్‌ను వినియోగిస్తున్నామని స్థానికుడు భైరనాథ్ కోటేకర్ తెలిపాడు. ‘గతంలో మాకు నాలుగైదు పశువులు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే ఉంది. అయినా మా పెరట్లోని ప్లాంటులో గ్యాస్ ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదు. మేం ట్యాంకులో పశువుల పేడను కలుపుతాం. టాయిలెట్‌లోని వ్యర్థాలను కూడా ఆ ట్యాంకులోకే డైవర్ట్ చేస్తాం. ప్లాంటు నుంచి మాకు సరిపడా గ్యాస్ లభిస్తోంది. అది మంచి నాణ్యతతో ఉంటోంది. ఇతరులు ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత గురించి ఆందోళనతో ఉండగా, మాకు ఆ చింత లేదు’ భైరనాథ్ పేర్కొన్నాడు
‘నేను తీసుకున్నది సరైన నిర్ణయమే’
‘పశువుల పేడ వృధాగా పోతోంది. ఇతరులు గోబర్ గ్యాస్ వాడటం చూసి, నేను నాలుగు నెలల క్రితమే రూ. 24,000 ఖర్చుతో బయోగ్యాస్ ప్లాంటును కట్టించాను. ఒక సంస్థ రాయితీ ధరలతో మాకు సామగ్రిని అందించింది. ఆ సామగ్రితోనే ప్లాంటు నిర్మాణం జరిగింది. ఇప్పుడు, ఇతర ప్రాంతాలలో గ్యాస్ కొరత ఏర్పడిందని తెలుస్తోంది. అవన్నీ చూస్తుంటే, నేను తీసుకున్నది సరైన నిర్ణయమే అనిపిస్తోంది’ అని మరో స్థానికుడు రైతు మారుతి కోటేకర్ చెప్పారు.
గ్యాస్ ఫ్రీ- డబ్బు ఆదా
‘మేం రోజుకు రెండుసార్లు ట్యాంకులో పేడ వేసి వంటకు సరిపడా గ్యాస్ పొందుతాం. ఎల్‌పీజీ సిలిండర్లలాగా మాకు బిల్లులు ఉండవు. కాబట్టి డబ్బు ఆదా అవుతుంది. గ్యాస్ సిలిండర్ల పేలుళ్ల భయం కూడా ఉండదు’ అని కట్టన్ భావి గ్రామానికి చెందిన గృహిణి మల్లవ్వ పవలే తెలిపారు.
ఈ ఊరు యావత్ దేశానికి రోల్ మోడల్
‘ముమ్మర ప్రచారం చేసినందు వల్లే కట్టన్ భావి గ్రామంలో ఇంత పెద్దసంఖ్యలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటి వల్ల ప్రజలంతా లబ్ధి పొందుతున్నారు. ప్లాంట్ల నిర్మాణానికి రాయితీలు లభించడం కలిసొచ్చింది. బెళగావి ఖాదీ గ్రామోద్యోగ్ సంఘ్ లాంటి సంస్థలు రాయితీపై ఇటుకలు, ఇసుక, సిమెంట్ వంటివి అందించాయి. దేశమంతటా ఇదే మోడల్‌ను అమలుచేస్తే, అన్ని పల్లెల్లో ఇంధన భద్రతను మనం సాధించొచ్చు’ అని బెళగావి ఖాదీ గ్రామోద్యోగ్ సంఘ్ కార్యదర్శి శ్రీరామ్ కామత్ తెలిపారు.





