ArticlesNews

ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు శ్రీ సద్గురు సమర్థ రామదాసు

65views

( సమర్థ రామదాసు జయంతి )

మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబ్ గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామ నవమి రోజున జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని మార్చి 27న జరుపుకుంటున్నాము. సమర్థ రామదాసు తండ్రి పేరు సూర్యజీ పంత్, తల్లి పేరు రాణూబాయ్. ఆయన అసలు పేరు నారాయణ సూర్యజీ తోషర్. ఎనిమిదో ఏటనే తండ్రి మరణించడంతో అంతర్ముఖుడిగా మారారు. ఎక్కువసేపు ధ్యానంలోనే గడిపేవారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడే తన పన్నెండో ఏట శ్రీరాముడి సాక్షాత్కారం పొందారు. శ్రీరాముడే ఆయనకు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించినట్లు ప్రతీతి. అప్పటి నుంచే ఆయన సమర్థ రామదాసుగా ప్రఖ్యాతి పొందారు. బాల్యంలో ఆట పాటలపై యోగాసనాలు, శారీరక వ్యాయామ విన్యాసాలపై ఆసక్తి చూపే సమర్థ రామదాసు రామబంటు అయిన హనుమంతుడిని కూడా ఎంతో ప్రీతిగా ఆరాధించేవారు.

సమర్థ రామదాసు యావత్ భారతదేశం పర్యటించి అప్పటి ప్రజల పరిస్థితులను చూసి కలత మనస్కులయ్యారు. సదాచార సంపన్నులు ఎందఱో ఆనాటి పాలకుల వలన ఇక్కట్ల పాలయ్యారు. ప్రజలను పీడించి పాలిస్తున్న ఆనాటి పాలకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కోసం వారు అన్వేషించ సాగారు. ఆయన 1566 సంవత్సరములో చఫల్ ఆనే గ్రాములో శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్టించి.. ప్రతి గ్రామ గ్రామాన రాముల వారి హనుమంతుల వారి గుళ్ళను కట్టించి భక్తి ప్రచారం చేయసాగారు. అలాగే అనేక విద్యాలయాలు కూడా ప్రారంభించి ఆనాటి ప్రజలను విద్యావంతులను చేయడానికి కృషి సలిపారు.

ఆనాటి ప్రజలకు స్వామీ వారి బోధనలపై అమితమైన నమ్మకం ఉండేది. ఆనాటి ప్రజల పరిస్థితులను విచారించి వారు అందరికీ ధైర్యం నూరి పోసి వారిని ప్రోత్సహించేవారు. కుటుంబములో స్త్రీ ప్రాముఖ్యతను పెంపొందింపజేసే విధముగా స్త్రీలకూ గౌరవ భావాలు కలిగేట్టు చేసి వారికి సమాజములో ఉన్నత స్థాయిని కలిగేట్టు చేసారు. సమర్థ రామదాసు సనాతన భారతము స్థాపించ దలచిన వాడై స్త్రీ పురుషులందరూ సమానులని, పురుషులు స్త్రీ గర్భము నుండే జన్మించారు కాబట్టి వారికి అత్యంత ప్రాముఖ్యత నివ్వాలని నొక్కి వక్కాణించారు. స్త్రీలకూ తన విద్యా సంస్థల బాధ్యతలు అప్పగించి వారు వాటిని ధైర్యంగా నడిపే విధంగా ప్రోత్సహించారు. అలా ఆయన శిష్యురాళ్ళు అయిన వెన్నా భాయి, అక్కా భాయి స్వామీ వారి విద్యాలయాలను నడిపే వారు. ఆరోజుల్లోనే వారు కుల మత వర్గ విభేదాలను ఖండించి హిందువుల ఐక్యత కోసమై కృషి చేసారు. మానవులందరూ సమానమని బోధించారు.

శివాజీ మహారాజు హైందవి సామ్రాజ్య స్థాపనకు కృషి చేస్తుండగా వారికీ వెన్ను దన్నుగా నిలిచి తన బోధనలతో అమిత చైతన్య వంతునిగా శివాజీని తీర్చిదిద్దారు. అలా సమర్థ రామదాసు తాను అనుకున్న హైందవ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేసారు. సమర్థ రామ దాసు గొప్ప కవి కూడా.. దశ బోధ, ఆత్మారాం, మన పంచకం, ఆనంద భువనం, శివ కళ్యాణ రాజ వంటి అనేక గ్రంథాలను రచించారు. మహారాష్ట్రీయులను తన గొప్ప బోధనలతో గొప్ప దార్మికులుగా, ధైర్య వంతులుగా, సాటి లేని దేశ భక్తులుగా తీర్చి దిద్దారు. చాలా శక్తి వంతమైన సమాజాన్ని సృష్టించారు. పేదరికం లేని సమానత్వం కలిగిన సమాజ స్థాపనలోనూ, మహారాజ శివాజీని ముందుండి నడిపించారు.

సమర్థ రామదాసు తన అనుభవ సారాంశాన్ని వివరిస్తూ ‘ఆస్మానీ సుల్తానీ’, ‘పరచక్ర నిరూపణ’ అనే ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ప్రబోధాత్మక కవితలతో పలు గ్రంథాలు రాశారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరు సాగించిన అప్పటి మరాఠీ యోధుడు శివాజీకి అండగా నిలిచారు. పలుచోట్ల పర్యటిస్తూ సంచార జీవితం కొనసాగించిన సమర్థ రామదాసు ఆద్యచాఫల్ మఠం, రామ మందిరం, దాసాంజనేయ మందిరం, వీర మారుతి మందిరం స్థాపించారు. అవసాన దశలో ప్రాయోపవేశం చేసి, తన 73వ ఏట సజ్జన్‌గడ్‌లో తుదిశ్వాస విడిచారు.